one flight instead of another: ఒంటరిగా అమ్మమ్మ దగ్గరికి బయలుదేరిన ఆరేళ్ల బాలుడు.. ఒక ఫ్లైట్‌కి బదులు మరొకటి ఎక్కించిన సిబ్బంది!

  • ఫ్లోరిడాలోని ఫోర్ట్ మైయర్స్‌కు వెళ్లాల్సిన ఫ్లైట్‌కు బదులు ఓర్లాండో వెళ్లాల్సిన విమానాన్ని ఎక్కించిన స్పిరిట్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది
  • బాలుడి కుటుంబానికి క్షమాపణలు చెప్పిన ఎయిర్‌లైన్స్
  • 160 మైళ్లు ప్రయాణించి బాలుడిని కలుసుకున్న అమ్మమ్మ
  • అమెరికాలో చోటుచేసుకున్న ఆసక్తికర ఘటన
A boy who left alone to visit his grandmother was put on another flight instead of one flight

అమెరికాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఫ్లోరిడాలోని ఫోర్ట్ మైయర్స్‌లో ఉన్న తన అమ్మమ్మను చూసేందుకు ఒంటరిగా బయలుదేరిన ఆరేళ్ల బాలుడికి షాకింగ్ అనుభవం ఎదురైంది. విమానయాన సంస్థ ‘స్పిరిట్ ఎయిర్‌లైన్స్’ సిబ్బంది పొరపాటున బాలుడిని ఫోర్ట్ మైయర్స్‌కు వెళ్లే ఫ్లైట్‌కు బదులు ఓర్లాండోకు వెళ్లే ఫ్లైట్‌ ఎక్కించారు. బాలుడు ఫిలడెల్ఫియా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి ఫోర్ట్ మైయర్స్‌లోని సౌత్‌వెస్ట్ ఫ్లోరిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు ప్రయాణించాల్సి ఉండగా ఈ తప్పిదం జరిగింది. దీంతో ఈ నిర్వాకానికి కారణమైన స్పిరిట్ ఎయిర్‌లైన్స్ బాధిత బాలుడి కుటుంబాన్ని క్షమాపణలు కోరింది. ఈ మేరకు ఒక ఈ-మెయిల్ ప్రకటన విడుదల చేసింది.

తప్పిదాన్ని గుర్తించిన వెంటనే బాలుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని స్పిరిట్ ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. అతడిని తిరిగి గమ్యస్థానానికి చేర్చేందుకు తక్షణ చర్యలు తీసుకున్నామని తెలిపింది. పిల్లాడు తమ సిబ్బంది సంరక్షణలో ఉన్నాడని పేర్కొంది. కాగా ఈ ఘటనపై బాలుడి అమ్మమ్మ మారియా రామోస్ షాక్‌కు గరయ్యింది. బాలుడు రావాల్సిన విమానంలో లేడని తెలుసుకొని భయాందోళనలకు గురయినట్టు ఆమె చెప్పారు. 

అయితే, ఓర్లాండోలో దిగిన తర్వాత బాలుడి నుంచి కాల్ వచ్చిందని చెప్పారు. దీంతో మనవడిని తీసుకురావడానికి ఫోర్ట్ మైయర్స్ నుంచి బయలుదేరి 160 మైళ్ల దూరం ప్రయాణించానని ఆమె మీడియాకు వెల్లడించారు. కాగా రామోస్ ప్రయాణ వ్యయాలను స్పిరిట్ ఎయిర్‌లైన్స్ భరించింది. అయితే ఈ తప్పిదానికి కారణం ఏంటని ఎయిర్‌లైన్స్‌ని రామోస్ ప్రశ్నించింది. ఈ ఘటనను తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని, అంతర్గత విచారణను నిర్వహిస్తున్నట్టుగా స్పిరిట్ ఎయిర్‌లైన్స్ సమాధానం ఇచ్చింది.

More Telugu News