Vyuham Movie: ‘వ్యూహం’ ఎఫెక్ట్.. డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ ఇంటి ముందు టీడీపీ కార్యకర్తల ఆందోళన !

  • ‘వ్యూహం’ సినిమాను విడుదల చేయొద్దంటూ ‘ఆర్టీవీ డెన్’ ముందు నిరసన చేపట్టిన టీడీపీ శ్రేణులు
  • చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్‌పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దని హెచ్చరిక
  • ఆర్జీవీ దిష్టిబొమ్మ దగ్దం.. పోలీసుల రాకతో వెళ్లిపోయిన టీడీపీ కార్యకర్తలు
TDP workers agitation in front of director Ramgopal Vermas house ahead of Vyuham Movie release

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వ్యూహం’ సినిమా విడుదలకు ముందు ప్రకంపనలు రేపుతోంది. చిత్రయూనిట్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు, వీడియోల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌‌లను పోలిన క్యారెక్టర్లపై ఇరు పార్టీల శ్రేణులు భగ్గుమంటున్నాయి. చంద్రబాబు ఇమేజ్‌ను దెబ్బతీసేలా తీశారంటూ సినిమా విడుదలపై టీడీపీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. వాయిదా అనంతరం ఈ నెల 29న విడుదలకు లైన్ క్లియర్ అవడంతో టీడీపీ కార్యకర్తలు మరింత భగ్గుమంటున్నారు. ‘వ్యూహం’ విడుదలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంటి ఎదుట టీడీపీ కార్యకర్తలు సోమవారం ఆందోళన చేపట్టారని తెలుస్తోంది.

రామ్ గోపాల్ వర్మ నివాసం ముందు నిరసన వ్యక్తం చేస్తూ దిష్టిబొమ్మను దగ్ధం చేశారని సమాచారం. ‘వ్యూహం’ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారని తెలుస్తోంది. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్‌పై ఇష్టారీతిలో వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారని సమాచారం. ఇష్టం వచ్చినట్టుగా సినిమాలు తీస్తే సహించబోమంటూ ఆర్జీవీని టీడీపీ కార్యకర్తలు హెచ్చరించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే పోలీసుల రాకతో అక్కడి నుంచి వారు వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ఇదిలా వుంచితే ‘వ్యూహం’ సినిమా ఈ 10నే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా సెన్సార్ బోర్డు ఆపింది. అయితే తిరిగి డిసెంబర్ 29న థియేటర్లలో విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది.

More Telugu News