Andhra Pradesh: వైసీపీ ప్రభుత్వం ప్రజా ధనాన్ని రెండు విధాలుగా దుర్వినియోగం చేస్తోంది: టీడీపీ ఎంపీ కనకమేడల ఆరోపణలు

  • జగన్ ఇన్ని ప్యాలెస్‌లకు ఎలా అధిపతి అయ్యారని ప్రశ్నించిన టీడీపీ సీనియర్ నేత
  • టీడీపీకి ఆదరణ పెరుగుతుండడంతో వైసీపీ నేతలకు నిద్రపట్టడంలేదని మండిపాటు
  • జగన్ వచ్చాకే రాజకీయ కక్షలు ఎక్కువయ్యాయని విమర్శ  
YCP government is misusing public money in two ways sasy MP Kanakamedala

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రజాధనాన్ని రెండు విధాలుగా దుర్వినియోగం చేస్తోందని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపించారు. ప్రభుత్వ స్కీముల పేరుతో స్కాములకు పాల్పడుతున్నారని, పార్టీ కార్యక్రమాలను ప్రభుత్వ కార్యక్రమాలుగా ప్రచారం చేసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం, జగన్ పాలనా వైఫల్యాలు అడుగడుగునా కనబడుతున్నాయని, ప్రజా ధనాన్ని విచ్చలవిడిగా వినియోగిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన ప్రభుత్వం వెనక్కి తీసుకెళ్తోందని, కక్షపూరిత రాజకీయాలతో కాలం వెళ్లబుచ్చుతోందని ఎంపీ కనకమేడల ఆరోపించారు. 

‘‘ రాష్ట్రంలో విధ్వంసకాన్ని సృష్టించడం తప్ప అభివృద్ధి శూన్యం. ప్రభుత్వం ప్రజాస్వామిక, ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోంది. ప్రభుత్వ లోపాలు ఎత్తిచూపితే, అవినీతిని ప్రశ్నిస్తే కక్షగట్టి కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారు. సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టినవారిని అర్ధరాత్రుళ్లు నిర్బంధిస్తున్నారు. వారిని ఊరూరా తిప్పి వేధిస్తున్నారు. పాలనా వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది’’ అంటూ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ మేరకు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

జగన్ ఇన్ని ప్యాలెస్‌లకు అధిపతి ఎలా అయ్యారు?
ఇంటి స్థలం లేదని చెప్పుకున్నవారికి ఇప్పుడు ఇన్ని ప్యాలెస్‌లు ఎలా వచ్చాయని సీఎం జగన్‌ను ఎంపీ కనకమేడల ప్రశ్నించారు.  రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆయనకు ఇంటి స్థలం లేక రాష్ట్ర ప్రభుత్వం నుంచి గజానికి వెయ్యి రూపాయల చొప్పున కోర్టుకు వెళ్లి స్థలం తీసుకున్నారని, దీన్ని రెగ్యులరైజ్ చేయించుకున్నారని అన్నారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ లక్ష కోట్లు దోచుకున్నారని మరోసారి ఆరోపించారు. మార్కెట్ విలువ ప్రకారం, సీబీఐ లెక్కల ప్రకారం జగన్ రూ. 43 వేల కోట్లు అవినీతికి పాల్పడ్డారని అన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అవినీతికి పాల్పడిన విషయం అదరికీ తెలుసని మండిపడ్డారు.

వైసీపీకి నిద్ర పట్టడంలేదు
టీడీపీకి పెరుగుతున్న ఆదరణ చూసి వైసీపీకి నిద్ర పట్టడంలేదని ఎండీ కనక మేడల మండిపడ్డారు.  టీడీపీ చంద్రబాబు, ఈనాడు రామోజీరావును తిట్టనిదే రోజు గడవదని అధికార పార్టీ నేతలపై  ప్రభుత్వం చేసిన మంచి పనులు తెలుసుకునేందుకు ప్రజల్లోకి వెళ్దామని, నిష్పక్షపాతంగా వారు చేసిన మంచి పనులు తెలుస్తాయని సవాలు విసిరారు. ప్రజలపై దౌర్జన్యాలు రాష్ట్రానికి పట్టిన దురదృష్టమని, ప్రభుత్వ ధనంతో రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ జగన్ పుట్టినరోజున ప్రకటన ఇచ్చిందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ప్రజల డబ్బుతో సాక్షి పత్రికలో ప్రకటనలు ఇస్తే ఆ డబ్బు జగన్‌కే దక్కుతుందని, ఇలా ఏ ప్రభుత్వంలోనూ లేదని, పత్రిక కథనాలు విమర్శించే స్థాయి ప్రబుత్వానికి లేదన్నారు. 

జగన్ వచ్చాకే రాజకీయ కక్షలు ఎక్కువయ్యాయి
రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం వచ్చాకే రాజకీయ కక్షలు పెరిగాయని ఆయన ఆరోపించారు. పారిశ్రామికవేత్తలను వ్యాపారాల్లో వాటాలు ఇవ్వమంటారని, 50 శాతం వాటాలు ఇవ్వాలని, ఖర్చులు వారే పెట్టుకోవాలని బెదిరిస్తారని అన్నారు. ఇదెక్కడి న్యాయమని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పరిశ్రమలు ప్రభుత్వానికి 50 వాతం వాటాలు ఇవ్వలేకపోయాయని, మరోవైపు ప్రభుత్వ యంత్రాంగం కేసులు పెట్టడం మొదలుపెట్టిందని, అమర్ రాజా కంపెనీ  విషయంలో స్వయంగా చూశామని ప్రస్తావించారు. పెట్టుబడి పెట్టనివ్వరని, బెదిరింపులకు పాల్పడతారని చెప్పారు. సంపాదనలో వాటాలు కావాలని డిమాండ్ చేస్తున్నారని, అందుకే  పరిశ్రమలు తరలిపోయాయని అన్నారు. రాజకీయ పరంగా ప్రతిపక్ష నాయకుల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని కనకమేడల ధ్వజమెత్తారు.

 రామోజీరావు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారు
ఈనాడు అధిపతి రామోజీరావు నైతిక విలువలు పాటిస్తూ, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ ఈ స్థాయికి వచ్చారని ఎంపీ కనకమేడల అన్నారు. దేశంలో అత్యంత రాజకీయ అవినీతి పరుడు జగన్ అని ఇంగ్లీష్ వరల్డ్ మేగజైన్ రాసిందని ప్రస్తావించారు. ‘‘ దానికి కారణం రామోజీరావే అని చెబుతారా? సాక్షిలో మీ పుట్టిన రోజునాడు యాడ్స్ ద్వారా ఎన్ని కోట్లు వచ్చాయో తెలపాలి. రైతులు, నిరుద్యోగులు, ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. రాష్ట్రాన్ని విధ్వంసక పర్వంలోకి నెట్టేసి మీ పబ్బం గడుపుకుంటున్నారు. పైగా ఎదురుదాడులు చేస్తున్నారు’’ అని ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ధ్వజమెత్తారు. 

పోలీసులను ప్రైవేట్ ఆర్మీగా మార్చుకున్నారు
పోలీసులను ప్రైవేటు ఆర్మీగా మార్చుకున్నారని వైసీపీ ప్రభుత్వ పెద్దలపై ఎంపీ కనకమేడల మండిపడ్డారు. నిరసన వ్యక్తంచేసినవారిపై దాడులు చేయిస్తున్నారని, అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడైనా కనువిప్పి కలగాలని, లేచినప్పటి నుంచి మంత్రులు చంద్రబాబును, రామోజీరావును దూషించడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. పవన్ కల్యాణ్‌ను దత్తపుత్రుడు అంటూ వెటకారంగా మాట్లాడుతారని, చంద్రబాబు నిద్రాహారాలు మాని ప్రజలకు సేవ చేశారని పేర్కొన్నారు. గందరగోళం సాక్షిలో ఏరోజైనా ఉన్నది ఉన్నట్లుగా రాశారా? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉన్నది ఉన్నట్లుగా ప్రచురించకుండా వక్రీకరించి రాస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిజాన్ని భ్రష్టు పట్టించారని సాక్షి పత్రికపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్‌కి వ్యక్తిగత అధికార పత్రిక సాక్షి అని, దీన్ని ప్రభుత్వ పత్రికగా భావిస్తున్నారని, పంచాయతీలకు డబ్బులిచ్చి ప్రభుత్వ సొమ్ముతో సాక్షి పత్రికను కొనిపిస్తున్నారని విమర్శించారు. ఆ విషయంపై కూడా కోర్టులో కేసు నడుస్తోందని ప్రస్తావించారు.

‘‘ వైసీపీ చేసిన గొప్పలు ఏమిటో చెప్పుకోవాలి. మీరు చేసిన తప్పులను మేం ఎత్తిచూపుతున్నాం. అది కాదని మీరు నిరూపించాలి. అందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడుతూనే ఉంటే మీ సాక్షి పత్రికను మీరే మూసుకోవాల్సి వస్తుంది. మీ పాలన ఎంతోకాలం సాగదు. మీకు మిగిలింది మూడు నెలల కాలమే. ఈ మూడు నెలల కాలంలో మీ భాగోతాలన్నీ బయటకు వస్తాయి. సత్యాన్ని గురించి మీరు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. కడియం శ్రీహరి మాట్లాడుతూ జగన్ అవినీతి గురించి మాట్లాడుతుంటే నాకు నవ్వొచ్చిందన్నారు. మార్గదర్శిపై, ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టటానికే మీకు టైం సరిపోవటంలేదు.  పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రజలను బెదిరించి పబ్బం గడుపుకుంటున్నారు. వైసీపీకి నైతిక హక్కులు లేవు. మోరల్స్ లేవు. రాజకీయపరమైన విలువలు లేవు, వ్యక్తిగత క్రమశిక్షణ లేదు. మరొకసారి నీతులు చెప్పద్దు. రేప్పొద్దున ప్రతిపక్షంలో ఉంటారు, అప్పుడు గౌరవించడానికి కొన్ని ఎథిక్స్ పాటించండి. అప్పుడే మీకు భవిష్యత్తు ఉంటుంది. అది కూడా లేకుండా చేసుకోవద్దు. మీ పార్టీలోని నాయకులే తిరగబడుతున్నారు. మీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో మీరొకసారి ప్రజల్లోకి వెళ్లి విచారిస్తే తెలుస్తుంది. మిమ్మల్ని నమ్ముకున్నవారినే మీరు న్యాయం చేయలేకపోయారు’’ అని కనకమేడల రవీంద్రకుమార్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తోంది
రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తోందని, పరిశ్రమలను వెళ్లగొట్టడం, కొత్త పరిశ్రలను రాకుండా చేయడమే ఈ పరిస్థితికి కారణమని వైసీపీ ప్రభుత్వం కనకమేడల విరుచుకుపడ్డారు. ‘‘ రాష్ట్రానికి రావాల్సిన సుమారు లక్షా పాతిక కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి రాకుండా భయపెట్టి పారిపోయేలా చేశారు. పరిశ్రమలు రాకుండా పారిశ్రామికులను భయపెట్టి  పలాయనం చిత్తగించేలా చేశారు. ఆసియా పేపర్, జాకీ ఇండస్ట్రీస్,  లూలూ గ్రూప్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఫ్రాంక్లిన్ అండ్ టెంపుల్,  డేటా సెంటర్, అమర్ రాజా బ్యాటరీస్ కంపెనీలతో చేసుకున్న ఎంఓయూలను ఆయా కంపెనీలు క్లోజ్ చేశాయి. దాదాపు 2 లక్షల మంది ఉద్యోగులు రోడ్ల పాలయ్యారు. కావాలని కక్ష కట్టి పరిశ్రమలను తరిమేసినట్లు ఈనాడులో ఆర్టికల్ కూడా ప్రచురితమైంది.  పట్టభద్రులు నిరుద్యోగంలో నెంబర్ వన్ అని కేంద్ర ప్రభుత్వ వార్షిక నివేదికలో వచ్చింది. ఆ నివేదిక కూడా ఈనాడులో ప్రచురితమైంది. పిరియాడిక్ లేబర్ ఫోర్స్ నివేదిక దాన్ని స్పష్టం చేసింది. పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం రాష్ట్రంలో డిగ్రీ చదివినవారిలో నిరుద్యోగ రేటు 24 శాతం ఉంది. ఇది నెంబర్ వన్. ఆ తరువాతే ఇతర రాష్ట్రాలు.  రాష్ట్రంలో రోజుకొక నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ప్రతి ఏడాది డీఎస్సీలు వేస్తామని హామీలిచ్చి మరిచారు, గ్రూప్ వన్, గ్రూప్ 2 పరీక్షలు లేక నాలుగేళ్లల్లో మొత్తం 1,340 మంది బలవన్మరణం పొందారు. పరిశ్రమలు మూతపడడంతో నిరుద్యోగం తాండవిస్తోంది’’ అని అన్నారు.

More Telugu News