Medaram: కరోనా భయంతో ముందుగానే మేడారానికి పోటెత్తిన భక్తులు

  • ఆదివారం లక్ష మంది భక్తుల రాక
  • కరోనా కేసులు పెరగొచ్చన్న భయాలతో పెరిగిన భక్తుల తాకిడి
  • ఏర్పాట్లు అరకొరగా ఉండటంతో అవస్థలు
  • అకస్మాత్తుగా భక్తజన సందోహం పెరగడంతో తలపట్టుకుంటున్న అధికారులు
Devotees throng medaram

మేడారం జాతరకు ఇంకా రెండు నెలల సమయం ఉండగానే భక్తులు అప్పుడే పోటెత్తుతున్నారు. కరోనా కేసులు పెరిగితే మళ్లీ రాలేమన్న భయంతో తండోపతండాలుగా తరలివస్తున్నారు. వరుస సెలవులు రావడంతో ఆదివారం ఏకంగా లక్ష మంది వనదేవతలను దర్శించుకున్నారు. సమ్మక్క, సారలమ్మ దేవతలకు పసుపు, కుంకుమ, ఎత్తు బంగారం (బెల్లం) మొక్కులు చెల్లించుకున్నారు. 

అపార జనసందోహం, అరకొర ఏర్పాట్ల కారణంగా మేడారానికి వచ్చిన భక్తులు ఆదివారం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జాతరకు ఇంకా రెండు నెలల సమయం ఉండటంతో ఇటీవలే ప్రభుత్వం జాతర నిర్వహణకు రూ.75 కోట్లు కేటాయించింది. టెండర్ల ప్రాసెస్ నడుస్తోంది. ఇంకా పనులేవీ మొదలు కాకపోవడంతో సరైన సౌకర్యాలు లేక భక్తులు అవస్థలు పడ్డారు. 

రద్దీ ఎక్కువగా ఉండటంతో ఓ దశలో దేవతల గద్దెల వద్ద తోపులాట జరిగింది. మేడారం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ చూసినా ప్రైవేట్ వెహికిల్స్ కనిపించాయి. కన్నెపల్లి రోడ్డువైపు వాహనాలు పార్క్ చేసుకోవడానికి పోలీసులు అనుమతించడంతో అక్కడి నుంచి గద్దెల వరకూ భక్తులు కాలినడకన వెళ్లాల్సి వచ్చింది. మరోవైపు, అకస్మాత్తుగా పెరిగిన రద్దీతో అధికారులు కూడా తలలు పట్టుకుంటున్నారు.

More Telugu News