Brij Bhushan Sharan Singh: ఇక 'రెజ్లింగ్' జోలికి వెళ్లను: బ్రిజ్ భూషణ్

  • భారత రెజ్లింగ్ లో కీలక పరిణామం
  • రెజ్లింగ్ వ్యవహారాలకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టు బ్రిజ్ భూషణ్ వెల్లడి
  • రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బ్రిజ్ భూషణ్ పై తీవ్రఆరోపణలు
  • మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ దుమారం
Brij Bhushan Sharan Singh said he will never been takes up wrestling matters

భారత రెజ్లింగ్ రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇక రెజ్లింగ్ వ్యవహారాలకు వీడ్కోలు పలుకుతున్నానని భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ప్రకటించారు. 

12 ఏళ్ల పాటు భారత రెజ్లింగ్ రంగానికి సేవలందించానని, అయితే, పదవీకాలంలో తాను చేసింది మంచో, చెడో కాలమే నిర్ణయిస్తుందని అన్నారు. ఇవాళ్టి నుంచి క్రీడలతో సంబంధం తెంచుకుంటున్నానని, రెజ్లింగ్ వ్యవహారాలకు తనకు ఇక సంబంధం లేదని బ్రిజ్ భూషణ్ స్పష్టం చేశారు. ఇకమీదట భారత రెజ్లింగ్ వ్యవహారాలను కొత్తగా ఎన్నికైన కార్యవర్గం చూసుకుంటుందని తెలిపారు. 

తాను బీజేపీ ఎంపీగా ఉన్నానని, ఎన్నికలు సమీపిస్తున్నందున తాను రాజకీయ కార్యకలాపాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని బ్రిజ్ భూషణ్ వివరించారు. తనపై ఇతర బాధ్యతలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం అనంతరం బ్రిజ్ భూషణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

బ్రిజ్ భూషణ్ భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని తీవ్ర ఆరోపణలు రావడం తెలిసిందే. ప్రముఖ రెజ్లర్లు ఈ ఆరోపణలు చేయడం, బ్రిజ్ భూషణ్ బీజేపీ ఎంపీ కావడం... తదితర కారణాలతో ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంది. విపక్షాలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై దుమ్మెత్తిపోశాయి. బ్రిజ్ భూషణ్ ను పదవి నుంచి తప్పించాలని రెజ్లర్లు, పార్టీలు డిమాండ్ చేయడమే కాదు, ఢిల్లీలో ఆందోళనలు కూడా నిర్వహించారు. 

తాజాగా, బ్రిజ్ భూషణ్ సన్నిహితుడైన సంజయ్ సింగ్ భారత రెజ్లింగ్ సమాఖ్య నూతన అధ్యక్షుడిగా ఎన్నికవడంతో మరోసారి దుమారం రేగింది. తాము రెజ్లింగ్ లో కొనసాగబోవడంలేదని మహిళా రెజ్లర్  సాక్షి మాలిక్ ప్రకటించగా, తన పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేస్తున్నట్టు స్టార్ రెజ్లర్ భజరంగ్ పునియా పేర్కొన్నాడు. ఈ క్రమంలో, నిబంధనలు  ఉల్లంఘించిందంటూ భారత రెజ్లింగ్ సమాఖ్య నూతన కార్యవర్గాన్ని కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసింది. 

ఈ నేపథ్యంలోనే, ఇక రెజ్లింగ్ వ్యవహారాలకు దూరంగా ఉండాలని బ్రిజ్ భూషణ్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

More Telugu News