Kodali Nani: ప్రశాంత్ కిశోర్ ను 2019లోనే వాడేశాం!: కొడాలి నాని

  • నిన్న చంద్రబాబుతో ప్రశాంత్ కిశోర్ భేటీ
  • చంద్రబాబు కాలం చెల్లిన రాజకీయ నేత అంటూ కొడాలి నాని వ్యాఖ్యలు
  • ఒట్టిపోయిన గేదెలాంటి ప్రశాంత్ కిశోర్ ను వ్యూహకర్తగా పెట్టుకున్నాడని విమర్శలు
  • ప్రశాంత్ కిశోర్ బుర్రలోని గుజ్జంతా తాము పీల్చేశామని వెల్లడి
Kodali Nani comments on Chandrababu meeting with Prashant Kishor

టీడీపీ అధినేత చంద్రబాబును ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కలవడంపై వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. చంద్రబాబు, ప్రశాంత్ కిశోర్ 3 గంటల పాటు సమావేశమయ్యారని, ఇక భూమి బద్దలవుతుందని ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు. 

చంద్రబాబు కాలం చెల్లిన రాజకీయనేత అని జగన్, తాము అనేకసార్లు చెప్పామని అన్నారు. ప్రశాంత్ కిశోర్ ను తాము 2019లోనే వాడేశామని తెలిపారు. అతని బుర్రలోని గుజ్జంతా అయిపోయిందని, ఒట్టిపోయిన గేదె లాంటి అతడ్ని తీసుకెళ్లి చంద్రబాబు వ్యూహకర్తగా పెట్టుకుంటున్నాడని విమర్శించారు. 

"ఇదే ప్రశాంత్ కిశోర్ ను మేం వ్యూహకర్తగా పెట్టుకుంటే, వాడెవడో బీహార్ నుంచి వచ్చాడట తమ్ముళ్లూ... మనల్ని ఏం పీకుతాడు, మనకంటే గొప్పవాళ్లు ఈ ప్రపంచంలో ఉన్నారా? అని చంద్రబాబు మాట్లాడాడు. జగనే బాబాయ్ హత్య చేయించారని, జగనే కోడికత్తితో పొడిపించుకున్నారని, వీటి వెనుక ఉన్నది ప్రశాంత్ కిశోరే అని చంద్రబాబు చెప్పాడు. ప్రజలను రెచ్చగొట్టి గెలిపించేందుకు ప్రశాంత్ కిశోర్ ప్రణాళిక రచించాడని అన్నాడు. ఇప్పుడు ప్రశాంత్ కిశోర్ ను పెట్టుకున్నారు కదా... మరి చంద్రబాబు పీక కోయించుకుంటాడా, లేక, లోకేశ్ తండ్రిని చంపుతాడా? అనేది వాళ్లకే తెలియాలి. 

చంద్రబాబు అవుట్ డేటెడ్ పొలిటీషియన్. మేం ఎప్పుడో 2019లో వాడేసిన వ్యక్తిని తీసుకొచ్చి 2024 ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నాడు. అసలు, ప్రశాంత్ కిశోర్ కు ఐప్యాక్ కు సంబంధం లేదు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత ఇక నేను వ్యూహకర్తగా పనిచేయడం లేదు, బీహార్ లో రాజకీయ పార్టీ పెట్టాను అని ప్రశాంత్ కిశోరే చెప్పాడు. నిన్న అతడు చంద్రబాబు వద్దకు వచ్చింది కూడా మమతా బెనర్జీ తరఫున మాట్లాడ్డానికి. ఇండియా కూటమిలో చేరమని అడగడానికి వచ్చాడు. 

చంద్రబాబు ఒక పీకేని పెట్టి బీజేపీతో చర్చలు జరుపుతున్నాడు, మరో పీకేని పెట్టి కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమితో చర్చలు జరుపుతున్నాడు. చంద్రబాబునాయుడిది రెండు కళ్ల సిద్ధాంతం. ఎవడు అధికారంలోకి వస్తాడో చంద్రబాబుకు అర్థంకావడంలేదు. కేంద్రంలో బీజేపీ వస్తుందో, లేక కాంగ్రెస్ వస్తుందో అనే కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. అందుకే... వాళ్లు కాకపోతే వీళ్లు, వీళ్లు కాకపోతే వాళ్లు అనుకుంటూ ఇద్దరు పీకేలను పెట్టుకున్నాడు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఏ పీకేని పెట్టుకున్నా జగన్ వెంట్రుక కూడా పీకలేరు" అంటూ కొడాలి నాని వ్యాఖ్యానించారు.

More Telugu News