Vyuham: 'వ్యూహం' చిత్రంలో అవన్నీ ఉంటాయి: వర్మ

  • వర్మ దర్శకత్వంలో వ్యూహం
  • నేడు విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్
  • వ్యూహం చిత్రంలో దేన్నీ వక్రీకరించలేదన్న వర్మ
  • తాను ఏం తీశానో సినిమా చూశాక మాట్లాడాలని విమర్శకులకు హితవు
Varma talks about Vyuham movie

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన పొలిటికల్ డ్రామా చిత్రం 'వ్యూహం'. ఇది ఏపీ సీఎం జగన్ ప్రస్థానానికి సంబంధించిన చిత్రం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇవాళ విజయవాడలో 'వ్యూహం' చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో, దర్శకుడు వర్మను మీడియా పలకరించింది. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజకీయాలకు, సినిమాలకు పెద్ద తేడా లేదని, రెండూ కూడా ప్రజలకు సంబంధించినవేనని అన్నారు. మాస్ లో వాటికి చాలా క్రేజ్ ఉందని తెలిపారు. 

తాను 'వ్యూహం' చిత్రంలో ఎక్కడా వక్రీకరించలేదని, ప్రచారంలో ఉన్న అంశాలనే తన చిత్రంలో చూపించానని తెలిపారు. ఏం వక్రీకరించానో తెలియకుండా, గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకుంటే ఎలా అని వర్మ ప్రశ్నించారు. వాళ్లు పొద్దున లేచిన దగ్గర్నుంచి వీడు దొంగ, వీడు మోసగాడు అంటుంటారు... ఇది వక్రీకరించడం కాదా? అని నిలదీశారు. తాను ఏం తీశానన్నది సినిమా చూశాక మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. 

వైఎస్సార్ పోయాక ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి? ఎవరెవరు ఎలాంటి వ్యూహాలు పన్నారు? దాని వల్ల ఏం జరిగింది అనేది ఈ సినిమాలో చూపించినట్టు వెల్లడించారు. 2009 నుంచి 2019 వరకు జగన్ కు సంబంధించిన అన్ని ఘట్టాలు ఈ చిత్రంలో ఉంటాయని వర్మ వివరించారు. 

తాను టీడీపీని టార్గెట్ చేస్తూ సినిమాలు తీస్తున్నాననడం సరికాదని అన్నారు. ఎన్టీఆర్ తన అభిమాన నటుడు అని, ఆయన జీవితంలోని ఘటనల ఆధారంగా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని తీశానని, ఇటు వైఎస్సార్ మరణం తర్వాత నెలకొన్న డ్రామా తనను ఆకర్షించిందని, ఆ పాయింట్ తోనే 'వ్యూహం' చిత్రం తెరకెక్కించానని వర్మ వివరించారు. 

అయితే, డిఫాల్ట్ గా ఈ రెండు చిత్రాల్లో చంద్రబాబు పాత్ర ఉందని, అంతేతప్ప ఆయనను టార్గెట్ చేయాలన్నది తన ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. నాకు ఆసక్తి కలిగిన రెండు సబ్జెక్ట్ మ్యాటర్లలో ఆయన ఉన్నారు... అంతే! అని వర్మ పేర్కొన్నారు. సినిమాల్లో కొందరికి మహేశ్ బాబు నచ్చుతాడని, కొందరికి పవన్ కల్యాణ్ నచ్చుతాడని... రాజకీయాల్లో కూడా ఇదే వర్తిస్తుందని అన్నారు.

More Telugu News