Kakatiya University: కేయూలో ర్యాగింగ్‌ కలకలం.. హాస్టల్స్ నుంచి 78 మంది విద్యార్థుల సస్పెన్షన్

78 students suspended from hostels in Kakatiya University for Raging
  • పరిచయాల పేరుతో జూనియర్లను ర్యాగింగ్ చేసిన సీనియర్ విద్యార్థులు
  • నిర్ధారణ కావడంతో చర్యలు తీసుకున్న యూనివర్సిటీ అధికారులు
  • నేటి నుంచి 31 వరకు కేయూ విద్యార్థులకు క్రిస్మస్ సెలవుల ప్రకటన
కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేగింది. పరిచయాల పేరుతో జూనియర్లపై పీజీ చివరి సంవత్సరం విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడ్డారని తేలడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. ఏకంగా 78 మంది విద్యార్థులను వారం రోజులపాటు హాస్టల్స్ నుంచి సస్పెండ్ చేశారు. కేయూలో ర్యాంగింగ్‌కు సంబంధించి మీడియాలో వార్తలు రావడంతో వర్సిటీ క్యాంపస్‌లోని హాస్టల్స్ సంచాలకులు, కళాశాల ప్రిన్సిపల్‌, ఇతర అధికారులు స్పందించి చర్యలు తీసుకున్నారు. ర్యాగింగ్‌కు పాల్పడ్డ విద్యార్థుల వివరాలు సేకరించారు. పద్మావతి ఉమెన్స్ హాస్టల్‌తోపాటు ఇతర అన్ని విభాగాల్లోనూ ర్యాగింగ్‌ జరిగినట్టు నిర్ధారించుకున్నాక సస్పెన్షన్ వేటు వేశారు. కామర్స్, జువాలజీ, ఎకనామిక్స్ విభాగాలకు చెందిన విద్యార్థి, విద్యార్థినులు ఈ జాబితాలో ఉన్నారు. 

మిగతా విభాగాల్లో ర్యాగింగ్‌పై దృష్టిసారించామని కేయూ హాస్టల్స్ సంచాలకులు ప్రొఫెసర్ వై వెంకయ్య చెప్పారు. వివరాలు సేకరిస్తున్నామని, సరైన ఆధారాలు లభిస్తే హాస్టల్స్ నుంచి సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. మరోవైపు నేటి (శనివారం) నుంచి ఈ నెల 31 వరకు కాకతీయ విద్యార్థులకు క్రిస్మస్‌ సెలవులు ప్రకటించారు. కాగా యూనివర్సిటీలో ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులను హాస్టల్స్ నుంచి సస్పెండ్ చేయడం ఇదే తొలిసారి కావడం చర్చనీయాంశమైంది.
Kakatiya University
Raging
students suspended
hostels
Education

More Telugu News