Bandi Sanjay: కరీంనగర్ ప్రజలకు శుభవార్తను తెలిపిన బండి సంజయ్

  • కరీంనగర్ - తిరుపతి రైలు ఇకపై వారానికి 4 రోజులు తిరుగుతుందన్న సంజయ్
  • ప్రస్తుతం వారానికి రెండు రోజులు తిరుగుతున్న రైలు
  • నేడు కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన సంజయ్
Bandi Sanjay good news to Karimnagar people

  కరీంనగర్ - తిరుపతి మధ్య రైలు ఇకపై వారానికి 4 రోజులు తిరుగుతుందని కరీంనగ్ ప్రజలకు బీజేపీ ఎంపీ బండి సంజయ్ శుభవార్తను తెలియజేశారు. ఇవాళ ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిసి కరీంనగర్ నుంచి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే భక్తులు పడుతున్న ఇబ్బందులతో పాటు, ఇతర రైల్వే సంబంధిత సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని ఆయన చెప్పారు. తన వినతికి సానుకూలంగా స్పందించిన రైల్వే మంత్రి కరీంనగర్ - తిరుపతి మధ్య రెండు రోజులు నడుస్తున్న రైలును ఇకపై వారానికి 4 రోజులు నడపాలని అధికారులను ఆదేశించారని తెలిపారు. 

మరోవైపు పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వే లైన్ లో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేని కారణంగా ఎదురవుతున్న సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి, అవసరమైన చోట రోడ్ అండర్ బ్రిడ్జ్ డ్రైనేజీలను మంజూరు చేయాలని కోరగా, సానుకూలంగా స్పందిస్తూ తక్షణమే తగిన చర్యలు తీసుకుంటామన్నారని తెలియజేశారు. అదేవిధంగా కరీంనగర్ - హసన్ పర్తి కొత్త రైల్వే లైన్ సర్వే పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారని చెప్పారు. జమ్మికుంట రైల్వే స్టేషన్ వద్ద తెలంగాణ ఎక్స్ ప్రెస్, దానాపూర్ ఎక్స్ ప్రెస్, నవజీవన్ ఎక్స్ ప్రెస్, గోరఖ్ పూర్ ఎక్స్ ప్రెస్ తో పాటు మరిన్ని రైళ్లకు హాల్ట్ కల్పించే అంశాన్ని పరిశీలిస్తానని మంత్రి హామీ ఇచ్చారని సంజయ్ వెల్లడించారు.

More Telugu News