Raghunandan Rao: ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బీఆర్ఎస్ తరఫున ప్రచారం చేశారంటూ గవర్నర్‌కు రఘునందన్ రావు ఫిర్యాదు

  • ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యపై ఫిర్యాదు చేసిన బీజేపీ నేత
  • రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ పార్టీకి ప్రచారం చేశారని ఆరోపణ
  • గవర్నర్ తన ఫిర్యాదు పట్ల సానుకూలంగా స్పందించారన్న రఘునందన్ రావు
BJP Raghunandan Rao complaint against SC ST chairman

ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు బీజేపీ నేత రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ వెంకటయ్య తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ప్రచారం చేశారని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికలకు ముందు దుబ్బాక నియోజకవర్గానికి చెందిన వెంకటయ్యను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా నియమించిందని, ఆయన భార్య సర్పంచ్‌గా కూడా ఉన్నారని తెలిపారు.

అయితే రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వెంకటయ్య బీఆర్ఎస్ తరఫున ఎన్నికల ప్రచారం, డబ్బు, మద్యం పంపిణీలో చురుగ్గా పాల్గొన్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ కండువా వేసుకొని కూడా ప్రచారం చేశారన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి సాక్ష్యాధారాలతో గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అధికార హోదాతో దుర్వినియోగానికి పాల్పడిన వెంకటయ్యపై చర్యలు తీసుకోవాలని, ఆయనను వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని కోరినట్లు చెప్పారు. తన ఫిర్యాదు పట్ల గవర్నర్ సానుకూలంగా స్పందించారన్నారు.

More Telugu News