Tirumala: టోకెన్లు లేకుండానే తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు... అధికారులతో వాగ్వాదం

Pilgrims rushed to Tirumala ahead of Mukkoti Ekadasi
  • రేపు ముక్కోటి ఏకాదశి
  • నిన్నటి నుంచే తిరుమలలో పెరిగిన రద్దీ
  • సర్వదర్శనానికి టోకెన్లు తప్పనిసరి చేసిన టీటీడీ అధికారులు
  • టోకెన్లు లేని భక్తులకు క్యూలైన్లలో ప్రవేశం నిరాకరణ
రేపు (డిసెంబరు 23) ముక్కోటి ఏకాదశి పర్వదినం. ఈ నేపథ్యంలో, తిరుమలలో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగిపోయింది. నిన్న సాయంత్రం నుంచే భక్తులు పోటెత్తుతున్నారు. అయితే వారు టోకెన్లు లేకుండా వస్తుండడంతో, టీటీడీ అధికారులు దర్శనానికి అనుమతించడంలేదు. 

క్యూలైన్లలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న భక్తులను టీటీడీ సిబ్బంది అడ్డుకుంటున్నారు. దాంతో ఏటీసీ సర్కిల్ వద్ద అధికారులకు, భక్తులకు మధ్య వాగ్యుద్ధం జరిగింది. సర్వదర్శన టోకెన్లు ఉన్నవారినే క్యూలైన్లలోకి పంపిస్తామని అధికారులు కరాఖండీగా చెప్పడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మరోవైపు, టోకెన్లు ఉన్నవారిని భక్తులు క్యూలైన్లలోకి అనుమతించగా, వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. ప్రస్తుతం భక్తుల క్యూలైన్ నారాయణగిరి గెస్ట్ హౌస్ వరకు ఉంది. 

వాస్తవానికి టీటీడీ డిసెంబరు 23 నుంచి జనవరి 1 వరకు మాత్రమే సర్వదర్శన టోకెన్లు తప్పనిసరి చేసింది. ఈ పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి దర్శనానికి టోకెన్లు తప్పనిసరి అని ప్రకటించలేదు. అయితే, భక్తులు అంచనాలకు మించి రావడంతో అధికారులు టోకెన్లు ఉంటేనే అనుమతి అని స్పష్టం చేస్తున్నారు. 

కాగా, వైకుంఠ ద్వార దర్శన టోకెన్లను గత రాత్రి నుంచి తిరుపతిలోని 9 కేంద్రాల ద్వారా భక్తులకు జారీ చేస్తున్నారు.
Tirumala
Pilgrims
TTD
Mukkoti Ekadasi

More Telugu News