Shivaji: పల్లవి ప్రశాంత్ అరెస్ట్ పై శివాజీ కీలక వ్యాఖ్యలు

  • ప్రశాంత్ బయటకు రాకముందే వాహనాలపై దాడులు జరిగాయన్న శివాజీ
  • బయట ఏం జరుగుతోందో ప్రశాంత్ కు తెలియదని వ్యాఖ్య
  • దాడులు చేసిన వాళ్లు ఎవరి అభిమానులో కూడా తెలియదన్న శివాజీ
  • అమర్ దీప్ ఫ్యామిలీ కూడా బాధ పడిందని వ్యాఖ్య
  • త్వరలోనే ప్రశాంత్ జైలు నుంచి బయటకు వస్తాడని ధీమా
Actor Shivaji comments on Pallavi Prashanth arrest

బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ కు టైటిల్ గెలిచిన ఆనందం ఎంతో సేపు నిలవలేదు. టైటిల్ ను చేతపట్టుకుని బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత జరిగిన ఘటనలు ఆయనకు మనశ్శాంతి లేకుండా చేశాయి. ఆయన ఫ్యాన్స్ కార్లు, బస్సుల అద్దాలు పగులగొట్టడంతో పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం పల్లవి ప్రశాంత్ చంచల్ గూడ జైల్లో ఉన్నారు. 

మరోవైపు, బిగ్ బాస్ హౌస్ లో శివాజీతో పల్లవి ప్రశాంత్ చనువుగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో, ప్రశాంత్ అరెస్ట్ పై శివాజీ ఎందుకు స్పందించడం లేదని పలువురు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో, శివాజీ స్పందించారు. ప్రశాంత్ కు ఏమీ కాదని, చట్ట ప్రకారమే బయటకు వస్తాడని చెప్పారు. తొలుత ప్రశాంత్ పారిపోయాడని ప్రచారం చేశారని... అలాంటి ప్రచారాలు చేయడం సరికాదని అన్నారు. నాలుగు నెలల పాటు ప్రశాంత్ తో కలిసి హౌస్ లో ఉన్నానని... అతను ఎలాంటివాడో తనకు తెలుసని చెప్పారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తి ప్రశాంత్ అని తెలిపారు. సోమవారంలోపు జైలు నుంచి బయటకు వస్తాడనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 

బయట ఏం జరుగుతోందో లోపల ఉన్న ప్రశాంత్ కి తెలియదని... ఆయన బయటకు రాకముందే వాహనాలను ధ్వంసం చేశారని శివాజీ చెప్పారు. ఈ దాడులకు పాల్పడిన వాళ్లు ఎవరి అభిమానులో కూడా తెలియదని అన్నారు. జరిగిన దాంతో అమర్ దీప్ కుటుంబ సభ్యులు ఎంత బాధపడ్డారో కూడా తనకు తెలుసని చెప్పారు. ప్రశాంత్ కుటుంబ సభ్యులతో తాను టచ్ లో ఉన్నానని తెలిపారు. గెలిచాననే ఆనందం మనిషిని కొన్నిసార్లు డామినేట్ చేస్తుందని... దాన్ని హ్యాండిల్ చేసేంత వయసు ప్రశాంత్ కు లేదని చెప్పారు. జరిగిన దాంట్లో ప్రశాంత్ తప్పేమీ లేదని అన్నారు. ఎవరో చేసిన తప్పుకు ప్రశాంత్ బాధను అనుభవిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశాంత్ కు వ్యతిరేకంగా ఎవరూ కామెంట్లు చేయొద్దని కోరారు.

More Telugu News