Reels To Death: రీల్స్ చూసి అనుకరించే ప్రయత్నం.. ఉరి బిగుసుకుని 11 ఏళ్ల బాలుడి మృతి

5th Class Student emulates act seen in reels in UP leads to death
  • ఉత్తరప్రదేశ్‌లోని హమీర్పూర్ జిల్లాలో ఘటన
  • రీల్స్ చూసి తల్లి స్కార్ఫ్‌తో ఉచ్చు
  • ప్రమాదవశాత్తు మెడకు బిగుసుకుపోవడంతో మృతి
ఉత్తరప్రదేశ్‌లోని హమీర్పూర్‌ జిల్లా రబీంద్రనాథ్ ఠాగోర్ నగర్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది. రీల్స్‌ను అనుకరిస్తూ చేసిన ప్రయత్నం బెడిసికొట్టడంతో ఐదో తరగతి చదువుతున్న 11 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. నిన్న మధ్యాహ్నం స్కూలు నుంచి వచ్చిన బాలుడు మొబైల్ ఫోన్లలో వీడియోలు చూస్తూ కూర్చున్నాడు. ఈ క్రమంలో ప్రాణాలు కాపాడుకునే టెక్నిక్ చూపించే రీల్ బాలుడిని ఆకర్షించింది. 

వెంటనే దానిని అనుకరించే ప్రయత్నం చేశాడు. తల్లి స్కార్ఫ్‌ను తీసుకుని ఉచ్చులా తయారుచేసి మెడచుట్టూ  వేసుకున్నాడు. ఈ క్రమంలో అది ప్రమాదవశాత్తు బిగుసుకోవడంతో ఊపిరి అందక ప్రాణాలు విడిచాడు. స్కార్ఫ్‌కు వేలాడుతున్న కుమారుడిని చూసి అప్రమత్తమైన తల్లి వెంటనే అది విప్పి ఆసుపత్రికి తీసుకెళ్లింది. పరీక్షించిన వైద్యులు బాలుడు అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు.

ఈ విషయమై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయకున్నా, సోషల్ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు పంపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Reels To Death
Uttar Pradesh
5th Class Student

More Telugu News