Windows 10: మైక్రోసాఫ్ట్ నిర్ణయం.. 24 కోట్ల కంప్యూటర్లపై ప్రభావం!

Microsoft Ending Windows 10 Support To Affect 240 Million Computers
  • 2025 కల్లా విండోస్ 10కు సపోర్టు నిలిపివేయనున్న మైక్రోసాఫ్ట్
  • విండోస్ 10 ఆధారిత 24 కోట్ల పీసీలు వ్యర్థాలుగా మారతాయన్న కెనాలిస్ రీసెర్చ్ సంస్థ
  • నిరుపయోగ పీసీలతో 48 కోట్ల కిలోల ఈ-వ్యర్థాలు పోగుబడతాయని హెచ్చరిక

విండోస్ 10కు సపోర్టు నిలిపివేసేందుకు సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ నిర్ణయించడంతో 24 కోట్ల కంప్యూటర్లు నిరుపయోగంగా మారే ప్రమాదం ఉందని కెనాలిస్ రీసెర్చ్ అనే సంస్థ తాజాగా పేర్కొంది. దీంతో, 48 కోట్ల కిలోల ఈ-వ్యవర్థాలు పేరుకుపోవచ్చని హెచ్చరించింది. విండోస్ 10కు సపోర్టు నిలిచిపోయిన కంప్యూటర్లను మరికొన్నేళ్ల పాటు వాడే అవకాశం ఉన్నప్పటికీ సెక్యూరిటీ అప్‌డేట్స్ లేని పక్షంలో వీటికి డిమాండ్ ఉండదని పేర్కొంది. 

2025 కల్లా విండోస్ 10కు సపోర్టు నిలిపివేయాలని మైక్రోసాఫ్ట్ లక్ష్యంగా పెట్టుకుంది.  అయితే, అక్టోబర్ 2028 వరకూ విండోస్ 10 ఓఎస్‌కు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందించాలని నిర్ణయించింది. వీటి వార్షిక ఫీజు ఎంత ఉండొచ్చనేది మాత్రం నిర్ణయించలేదు. గత అనుభవాల దృష్ట్యా సెక్యూరిటీ అప్‌డేట్స్‌కు వార్షిక ఫీజు చెల్లించడం కంటే కొత్తవాటి కొనుగోలువైపు ప్రజలు మొగ్గు చూపే అవకాశం ఉందని కెనాలిస్ అంచనా వేస్తోంది. దీంతో, పాత పీసీలు అనేకం ఈ- వ్యర్థాలుగా ల్యాండ్ ఫిల్స్‌లో పోగుబడొచ్చని హెచ్చరించింది. అయితే, కనాలిస్ నివేదికపై మైక్రోసాఫ్ట్ ఇంకా స్పందించాల్సి ఉంది.  

కాగా, ఏఐ సాంకేతికతను కొత్త తరం ఓఎస్‌లో ప్రవేశపెట్టేందుకు మైక్రోసాఫ్ట్ నిర్ణయించింది. దీంతో, పీసీ అమ్మకాలు మరోసారి ఊపందుకుంటాయని భావిస్తోంది.

  • Loading...

More Telugu News