army truck: ఆర్మీ ట్రక్కులపై ఉగ్రవాదుల మెరుపుదాడి.. ఎదురుకాల్పుల్లో ముగ్గురు సైనికుల వీరమరణం

  • జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఉగ్రవాదుల దుశ్చర్య
  • ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ చేపడుతుండగా రెండు ఆర్మీ ట్రక్కులపై దాడి చేసిన తీవ్రవాదులు
  • ఇంటెలిజెన్సీ సమాచారంతో బుధవారం రాత్రి నుంచి ఆపరేషన్ చేపడుతున్న ఆర్మీ
Terrorists ambushed an army truck and Three soldiers died in the exchange of fire

జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఉగ్రవాదులు మరో దుశ్చర్యకు పాల్పడ్డారు. గురువారం సాయంత్రం 3.45 గంటల సమయంలో రాజౌరిలోని పూంచ్ ప్రాంతంలో ఉన్న డేరా కీ గలీ నుంచి వెళ్తున్న రెండు ఆర్మీ ట్రక్కులపై ఉగ్రవాదులు ఆకస్మిక దాడికి తెగబడ్డారు. దీంతో సైనికులు, ఆర్మీ మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు సైనికులు వీరమరణం పొందారు. మరో ముగ్గురు జవానులు తీవ్రంగా గాయపడ్డారని ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. కాగా ఉగ్రవాదులు నక్కి ఉన్నారని ఇంటెలిజెన్సీ సమాచారం అందడంతో డీకేజీ (డేరా కీ గలీ) ప్రాంతంలో బుధవారం రాత్రి నుంచి భారత సైన్యం ఆపరేషన్ చేపడుతోంది. గురువారం సాయంత్రం నుంచి ఉగ్రవాదులు, సైన్యం మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయని, ఎన్‌కౌంటర్‌లో పురోగతి ఉందని ఆర్మీ ప్రతినిధి వెల్లడించారు. 

రాజౌరీ ప్రాంతంలో రెండేళ్లలోనే 35 మంది సైనికుల కన్నుమూత

జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి ప్రాంతంలో ఉగ్రదాడులు ఎక్కువయ్యాయి. గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతం ఉగ్రవాదులకు నిలయంగా మారింది. 2003 నుంచి 2021 వరకు ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంతంలో గత రెండేళ్ల వ్యవధిలో ఉగ్రవాద కార్యకలాపాలు బాగా పెరిగిపోయాయి. అందుకే ఈ ప్రాంతంలో సైన్యం పెద్దఎత్తున ఉగ్రవాద నిరోధక ఆపరేషన్లు చేపడుతోంది. అయితే ఈ ఆపరేషన్‌లలో పాల్గొంటున్న సైనికులు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. గత రెండేళ్ల వ్యవధిలో ఏకంగా 35 మంది కన్నుమూశారని ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. రాజౌరీలోని కలాకోట్‌లో గత నెలలో చేపట్టిన యాంటి టెర్రరిస్ట్ ఆపరేషన్‌లో ఇద్దరు కెప్టెన్లు సహా ఐదుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో రాజౌరీ-పూంచ్ ప్రాంతంలో జరిగిన జంట దాడుల్లో 10 మంది సైనికులు చనిపోయిన విషయం తెలిసిందే.

More Telugu News