Revanth Reddy: పాతబస్తీ విద్యుత్ బకాయిలు...: రేవంత్ రెడ్డి వర్సెస్ అక్బరుద్దీన్

  • షబ్బీర్ అలీని, అజారుద్దీన్‌ను ఓడించేందుకు మజ్లిస్ పార్టీ ప్రయత్నం చేసిందని రేవంత్ రెడ్డి ఆరోపణ
  • అదే మజ్లిస్ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల నుంచి ఎందుకు పోటీ చేయలేదని ప్రశ్న
  •  తాము ఎవరికీ భయపడమన్న అక్బరుద్దీన్ ఒవైసీ
Revanth Reddy versus Akbaruddin Owaisi in Assembly

తెలంగాణ శాసన సభలో విద్యుత్‌పై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మజ్లిస్ పార్టీ నేత అక్బరుద్దీన్ ఒవైసీ మధ్య వాగ్యుద్ధం నడిచింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్, మజ్లిస్ పార్టీలు కలిసి పని చేశాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. నిజామాబాద్‌ అర్బన్‌లో షబ్బీర్ అలీని, జూబ్లీహిల్స్‌లో అజారుద్దీన్‌ను ఓడించేందుకు కేసీఆర్‌తో కలిసి మజ్లిస్ పని చేసిందని విమర్శించారు. అదే మజ్లిస్ పార్టీ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలలో ఎందుకు పోటీ చేయలేదు? అని నిలదీశారు. కానీ తమ పార్టీ కాంగ్రెస్ మైనార్టీ ముఖ్యమంత్రులను, మైనార్టీ రాష్ట్రపతులను చేసిందని వ్యాఖ్యానించారు. మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని తెలిపారు.

అక్బరుద్దీన్.. కేసీఆర్‌కు మిత్రుడు కావొచ్చు... మోదీకి మద్దతివ్వవచ్చు.. అది వాళ్ళిష్టం.. కానీ తమకు పాత బస్తీ, కొత్త బస్తీ అనే తేడాలు లేవన్నారు. పాతబస్తీని అభివృద్ధి చేస్తామన్నారు. మజ్లిస్, బీఆర్ఎస్ మిత్రపక్షాలు అని కేసీఆర్ పలుమార్లు చెప్పారని గుర్తు చేశారు. అక్బరుద్దీన్ ఎంతసేపు మాట్లాడినా ఇబ్బంది లేదని, ఆయన ఆరుసార్లు గెలిచారని, అందుకే ప్రొటెం స్పీకర్‌గా అవకాశం ఇచ్చామని రేవంత్ రెడ్డి చెప్పారు. మజ్లిస్ పార్టీ కేసీఆర్‌ను రక్షించేందుకు ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కోసమేమో... కరెంట్ కోసం ఆందోళనలు జరగడం లేదని చెబుతున్నారని విమర్శించారు. అక్బరుద్దీన్ ముస్లింలందరికీ నాయకుడు కాదని... ఆయన కేవలం మజ్లిస్ పార్టీకి మాత్రమే నాయకుడని చురక అంటించారు.

అక్బరుద్దీన్ అన్ని విషయాలు చెబుతున్నారు కానీ పాతబస్తీలో విద్యుత్ బకాయిలు చెల్లింపులు జరిగేలా చూసే బాధ్యత తనది అని మాత్రం చెప్పడం లేదని రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. విద్యుత్ మొండి బకాయిల్లో సిద్దిపేట, గజ్వేల్ టాప్‌లో ఉన్నాయన్నారు. శ్రీశైలం ఎడమ కాలువ సొరంగం బ్లాస్ట్ అయి ఎనిమిది మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అందులో ఫాతిమా అనే ముస్లిం ఉంటే మజ్లిస్ పార్టీ కనీసం ఆమె గురించి మాట్లాడలేదన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగా మజ్లిస్ సభ్యులు వెల్‌లోకి దూసుకు వచ్చే ప్రయత్నం చేశారు.

మేం ఎవరికీ భయపడం... అక్బరుద్దీన్

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై అక్బరుద్దీన్ తీవ్రంగా స్పందించారు. తాము ఎవరికీ భయపడమని, కిరణ్ కుమార్ రెడ్డి జైల్లో పెట్టినా భయపడలేదన్నారు. కాంగ్రెస్ తమను అణచివేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి పాతబస్తీలో విద్యుత్ చౌర్యం అంటున్నారా? విద్యుత్ బకాయిలు అంటున్నారా? చెప్పాలన్నారు. ఇక తమను ఆయా చోట్ల పోటీ చేయలేదని ఆయన ప్రశ్నిస్తున్నారని, ఎక్కడ పోటీ చేయాలనేది తమ ఇష్టమన్నారు. షబ్బీర్ అలీని ఓడించేందుకు ప్రయత్నించామని చెబుతున్నారని, తాము నిజామాబాద్ అర్బన్‌లో పోటీయే చేయలేదన్నారు.

More Telugu News