Bhatti: 62,641 కోట్ల నష్టంలో డిస్కంలు.. అసెంబ్లీలో భట్టి విక్రమార్క వెల్లడి

  • విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేసిన డిప్యూటీ సీఎం
  • మొత్తం అప్పు 81,516 కోట్లు 
  • గత ప్రభుత్వ నిర్ణయాలతో విద్యుత్ రంగం కుదేలైందని ఆరోపణ
Mallu Bhatti Vikramarka Released White Paper On Electricity Department

తెలంగాణలో విద్యుత్ రంగం పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో వెల్లడించారు. రాష్ట్ర విద్యుత్ రంగంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా భట్టి మాట్లాడారు. విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేశారు. రాష్ట్ర మనుగడకు, విద్యుత్ రంగం పరిస్థితి ప్రజలకు తెలియజేయడానికి ఈ శ్వేతపత్రం విడుదల చేస్తున్నట్లు చెప్పారు. డిస్కంలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయని, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు బకాయిలు చెల్లించడంలేదని తెలిపారు. గత ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదని ఆరోపించారు.

2023 నాటికి విద్యుత్ రంగం అప్పులు రూ.81,516 కోట్లు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. డిస్కంలకు వివిధ శాఖల నుంచి రూ.28,673 కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్పారు. మొత్తంగా డిస్కంలు రూ.62,641 కోట్ల నష్టంలో ఉన్నాయని వివరించారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, సరఫరా వివరాలను ప్రజలకు వివరించడంతో పాటు వ్యవసాయ రంగానికి నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు. గత ప్రభుత్వం అస్తవ్యస్త నిర్ణయాలతో విద్యుత్ రంగం ఆర్థికంగా కుదేలయిందని, ఈ స్థితిని చక్కదిద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.

More Telugu News