Pawan Kalyan: పాదయాత్ర చేసే అవకాశం నాకు రానందుకు బాధపడుతున్నా: పవన్ కల్యాణ్

  • పోలిపల్లిలో టీడీపీ యువగళం నవశకం సభ
  • హాజరైన జనసేనాని పవన్ కల్యాణ్
  • తాను నడుద్దామంటే నడిచే పరిస్థితి లేదన్న జనసేనాని
  • పాదయాత్ర వల్ల ప్రజల కష్టాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని వెల్లడి
  • లోకేశ్ కు పాదయాత్ర చేయడం ఆనందం కలిగించిందని వ్యాఖ్యలు
Pawan Kalyan detailed speech in TDP Yuvagalam Navasakam meeting

విజయనగరం జిల్లా పోలిపల్లిలో ఏర్పాటు చేసిన టీడీపీ యువగళం నవశకం సభలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "నేను నడుద్దామంటే నడిచే పరిస్థితి లేదు. పాదయాత్ర వల్ల చాలామంది కష్టసుఖాలు తెలుసుకోవచ్చు. అలాంటి అవకాశం నాకు రానందుకు బాధపడుతున్నా. లోకేశ్ యువగళం పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసినందుకు ఆనందంగా ఉంది" అని వివరించారు. 


అప్పుడు చాలా బాధ కలిగింది

"చంద్రబాబును అన్యాయంగా జైలులో పెట్టినపుడు చాలా బాధ కలిగింది. కష్టాలను చిన్నప్పటి నుంచి దగ్గరగా చూసిన వాడ్ని, ఓటమి ఎదురైనప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందో నాకు తెలుసు. భువనేశ్వరి గారి బాధను అర్థం చేసుకున్నాను. కష్టాల్లో ఉన్నపుడు నా వంతు సాయంగా రాజమండ్రి జైలు వద్దకు వెళ్లి వారికి సంఘీభావం తెలిపాను.  ఎన్డీయేలో కీలక పాత్ర వహించిన వ్యక్తి, నాలుగున్నర దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన చంద్రబాబును అరెస్టు చేసి జైలుకు పంపడం నన్ను బాధించింది. జగన్ ను జైలులో పెట్టింది కాంగ్రెస్ పార్టీ అయితే, చంద్రబాబుపై కక్షగట్టారు" అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

మేం విడిపోయిన ఫలితమే జగన్ ప్రభుత్వం వచ్చింది!

రాజధాని లేకుండా, సరైన పంపకాలు లేకుండా విభజన జరగడంతో రాష్ట్ర భవిష్యత్తుకోసం ఆనాడు టీడీపీ సంకీర్ణానికి మద్దతు ఇచ్చాను. అప్పట్లో ఒక దశాబ్ద కాలం పాటు అండగా నిలుద్దామని భావించాను. దురదృష్టవశాత్తు అభిప్రాయ భేదాలవల్ల 2019లో ముందుకు తీసుకెళ్లలేకపోయాను. ఆ లోటు తాలూకు ఫలితమే జగన్ ప్రభుత్వం వచ్చింది. దశాబ్ద కాలం పాటు రాష్ట్ర పీఠంపై సుదీర్ఘ రాజకీయ నేత ఉంటే బాగుంటుందని భావించాను, దురదృష్టవశాత్తు మిస్ అయ్యాం. 2024లో మనం ప్రభుత్వం స్థాపిస్తున్నాం, మార్పు తెస్తున్నాం, జగన్ ను ఇంటికి పంపించడం ఖాయం. పాతికమంది ఎమ్మెల్యేలను మార్చారు, మరో 80 మందిని మారుస్తారని విన్నాను, మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు... ముఖ్యమంత్రి జగన్ ని.

నాకు జగన్ పై కోపం లేదు

నాకు జగన్ పై వ్యక్తిగత కక్షలేదు. ప్రభుత్వాన్ని సమర్థంగా నడపాల్సిన వ్యక్తి కూల్చివేతలతో మొదలుపెట్టాడు. ఎదురు తిరిగితే కేసులు పెట్టే పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంటుందని భావించలేదు. మేము ఒక రాజకీయపార్టీగా, ఆయన ముఖ్యమంత్రి అయితే శుభాకాంక్షలు చెప్పాం, ఆయనకు మాత్రం ప్రజాస్వామ్య స్ఫూర్తి తెలియదు. మేం ప్రభుత్వ వైఫల్యాలను విమర్శిస్తే నీచంగా తిట్టించడం దారుణం, దశాబ్దాల రాజకీయ జీవితంలో వైఎస్ కూడా ఆడపడుచులను, ఇంట్లోంచి బయటకు రాని వ్యక్తులను విమర్శించలేదు, ఇది ఏం రాజకీయం? 

ఒక ఉన్నతస్థాయి అధికారి నాతో నీచంగా ప్రవర్తించాడు!

వారాహి యాత్ర ప్రారంభమైతే నాపై కువిమర్శలు చేశారు. విశాఖపట్నంలో ఎయిర్ పోర్టునుంచి పార్టీ కార్యక్రమాలకు వస్తుంటే పోలీసులతో అడ్డగించారు. ఒక ఉన్నతస్థాయి అధికారి నాతో నీచంగా ప్రవర్తించారు. సకలశాఖ మంత్రి నన్ను అడ్డగించాలని డైరక్షన్ ఇచ్చారు. ఇప్పటం సభలో వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పాను. రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి పెట్టుబడులు రావాలని భావించి నేను ఆ మాటలు అన్నాను. ఇవాళ ఈ నవశకం సభలో ఈ క్షణాలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును నిర్దేశించే క్షణాలు. 

ఈ పొత్తుకు మీ ఆశీస్సులు కోవాలని బీజేపీ పెద్దలను కోరాను

బీజేపీని మోసం చేశానని నన్ను వైసీపీ నేతలు విమర్శించారు. అయితే నేను ఏపీ పరిస్థితులను బీజేపీ జాతీయ నాయకత్వానికి వివరించాను. టీడీపీ-జనసేన పొత్తుకు మీ మద్దతు కావాలని అమిత్ షాకు తెలియజేశాను. వారు ఎంతవరకు ఒప్పుకుంటారో తెలియదు. రాబోయే ఎన్నికల పొత్తు కీలకమైంది. పొత్తుపెట్టుకోకపోతే భవిష్యత్తులో కర్రలు, కత్తులతో రోడ్లపైకి వచ్చి కొట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. నాతో సహా అందరం ఆయుధాలతో రోడ్లపైకి రావాల్సి వస్తుందని బీజేపీ కేంద్రనాయకత్వానికి చెప్పాను. 

జనసేన ఆలోచన విధానంపై లోకేశ్ తో మాట్లాడాను. భవిష్యత్తులో ఉమ్మడి మ్యానిఫెస్టో రూపొందిస్తాం. చంద్రబాబు, నేను కలిసి రానున్న రోజుల్లో భారీ సభ ఏర్పాటుచేసి ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల చేస్తాం. ఇది లోకేశ్ సభ కాబట్టి కుదించి మాట్లడుతున్నాను. నేను ఆలోచిస్తున్నది 5 కోట్లమంది రాష్ట్ర భవిష్యత్తు తప్ప వేరే ఆలోచన నాకు లేదు. ఈ మైత్రి, ఈ స్ఫూర్తి చాలా సంవత్సరాలు కొనసాగాలని ఆశిస్తున్నాను.  హలో ఏపీ... బైబై వైసీపీ... టీడీపీ-జనసేన మైత్రి వర్థిల్లాలి" అంటూ పవన్ తన ప్రసంగం ముగించారు.

More Telugu News