Rammohan Naidu: రాబోయే 100 రోజుల్లో రాష్ట్రానికి పట్టిన శని వదులుతుంది: రామ్మోహన్ నాయుడు

  • యువగళం నవశకం కార్యక్రమంలో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడి ప్రసంగం
  • యువగళానికి ఈ సభ మరో ఆరంభమని వ్యాఖ్య
  • మరో వందరోజుల్లో ఏపీకి పట్టిన శని వదిలిపోతుందని వెల్లడి
  • సభను చూసి ప్రత్యర్థులు భయపడతారని కామెంట్
Rammohan Naidu speech in Yuvagalam concluding event

యువగళం-నవశకం విజయోత్సవ సభకు పార్టీ శ్రేణులు, ప్రజలు పోటెత్తారు. జనసందోహంతో పోలిపల్లి సభా ప్రాంగణం జనసంద్రాన్ని తలపించింది. ఈ సభలో ప్రసంగించిన టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు.. నేటి సభ ముగింపు కాదని ఆరంభమని వ్యాఖ్యానించారు. రాబోయే వంద రోజుల్లో రాష్ట్రానికి పట్టిన శని వదిలి టీడీపీ-జనసేన అధికారంలోకి వస్తాయన్నారు.  

“ ‘యువగళం-నవశకం’ కార్యక్రమాన్ని జనసముద్రంగా మార్చిన కార్యకర్తలు.. వీర మహిళలు.. నిజంగా గర్వపడాల్సిన సమయం. ఉద్యమాల పురిటిగడ్డ అయిన ఉత్తరాంధ్రలో ఈ కార్యక్రమం జరగడం మన అదృష్టం. దేశ రాజకీయ చరిత్రలో ఒక ఘట్టంగా నిలిచిపోయే గొప్ప కార్యక్రమం నేడు మనగడ్డపై జరుగుతోంది. యువగళం పాదయాత్ర ప్రారంభంతో చిత్తూరు చిందులేస్తే.. కడప కదిలింది. కర్నూలు కన్నుల పండువగా మారింది. అనంతపురం ఆత్మీయతను చాటుకుంది. నెల్లూరు నడుము బిగించింది. ఒంగోలు ఉరకలేసింది.. గుంటూరు గర్జించింది. కృష్ణా కృష్ణమ్మలా కరుణ చూపింది. గోదావరి గర్జించింది.. విశాఖపట్నం విజృంభిస్తే..విజయనగరం విజయపతాకం ఎగరేసింది. శ్రీకాకుళం శంఖారావం పూరించి.. ఉత్సాహంతో ఉరుముతూ ఉద్యమంతో ముందుకు ఉరికింది’ 
 ‘నేటి ఈ కార్యక్రమం ముగింపు కాదు.. ఇప్పటినుంచే ఆరంభం.  ఇదే ఉత్సాహంతో మరో 100 రోజులు కొనసాగిస్తే.. టీడీపీ-జనసేన ప్రభుత్వాన్ని చూస్తాం. 100 రోజుల్లో రాష్ట్రానికి పట్టిన శని వదిలించుకొని సైకోను తరిమితరిమి కొట్టబోతున్నాం. 100 రోజుల్లో దళితులు, ఆడబిడ్డలపై జరుగుతున్న అన్యాయాలు, అఘాయిత్యాలను కట్టడి చేయబోతున్నాం. 100 రోజుల్లో యువతకు మంచి ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నాం. 100 రోజుల్లో రైతుల ముఖాల్లో ఆనందం నింపి, వారిని రారాజుల్ని చేయబోతున్నాం. 100 రోజుల్లో బడుగుబలహీన వర్గాల్ని పైకి తీసుకురాబోతున్నాం, 100 రోజుల్లో పోలవరం పూర్తిచేయడానికి శంఖారావం ఊదబోతున్నాం.. 100  రోజుల్లో మన రాష్ట్ర రాజధాని ఇదని గర్వంగా చెప్పుకోబో తున్నాం’ 

‘అన్నింటికంటే ఘనంగా నేను తెలుగోడిని.. నేను ఆంధ్రుడిని అని ప్రతి ఒక్కరూ ప్రపంచం మొత్తం గర్వపడేలా రొమ్ము విరుచుకొని నడిచే రోజులు చూడబోతున్నాం. ఇదే ఉత్సాహంతో నాలుగున్నరేళ్లు పడిన కష్టాలు..బాధలు అధిగమించి మనం ముందుకు సాగాలి. 2019 ఎన్నికలు ముగిశాక చంద్రబాబు పని అయిపోయింది.. పసుపు రంగు కనిపించదు..తెలుగుగుదేశం కథ ముగిసింది అన్నారు. అలా అన్నవాళ్లు ఒక్కసారి ఇక్కడికొచ్చి చూస్తే.. కనుచూపు మేరలో కనిపిస్తున్న తెలుగుదేశం, జనసేన కార్యకర్తల్ని చూసి అదిరి పడతారు. ఈ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా తెలుగుదేశం -  జనసేన కార్యకర్తలు గుండెధైర్యంతోనే ముందుకు సాగారు’

రాబోయే 100 రోజులు క్రమశిక్షణతో, కలిసికట్టుగా ముందుకు సాగి అనుకున్న లక్ష్యాలు సాధించాలని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి. ఎవరికైనా ఏమైనా ఇబ్బంది కలిగినా.. తప్పు జరిగిందని అనిపించినా పెద్దమనస్సుతో పెద్దమనుషుల్లా క్షమించి, ఇది మన కార్యక్రమం అనుకొని సర్దుకుపోవాలని కోరుతున్నాను. ఈ సభను చూసి బాధపడాల్సింది తాడేపల్లిలోని పిల్లి మాత్రమేనని గుర్తుంచుకోండి” అని రామ్మోహన్ నాయుడు సూచించారు.

More Telugu News