Pallavi Prasanth: బిగ్‌బాస్-7 విజేత పల్లవి ప్రశాంత్ కోసం పోలీసుల గాలింపు.. రంగంలోకి ప్రత్యేక బృందాలు

  • అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద విధ్వంసం కేసు
  • నిన్న సాయంత్రం ఇద్దరి అరెస్ట్
  • ఏ1 నిందితుడు పల్లవి ప్రశాంత్ కోసం స్వగ్రామం వెళ్లిన పోలీసులు
  • ఫోన్ స్విచ్చాఫ్ చేసుకుని మరో ప్రాంతానికి ప్రశాంత్
  • సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుల గుర్తింపు
  • అభిమానులపైనా కేసులు 
Jubilee Hills police searching for Bigg Boss 7 winner Pallavi Prasanth

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్-7 విజేత పల్లవి ప్రశాంత్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. బిగ్‌బాస్ ఫైనల్స్ అనంతరం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద అభిమానులు వీరంగం సృష్టించిన కేసులో పల్లవి ప్రశాంత్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.  ఆదివారం జరిగిన ఫైనల్స్ అనంతరం బయటకు వచ్చిన కంటెస్టెంట్ల వాహనాలను అభిమానులుగా విడిపోయిన కొందరు ధ్వంసం చేశారు. అంతేకాదు, అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సులపైనా ప్రతాపం చూపారు. బస్సుల అద్దాలు పగలగొట్టారు. ఈ ఘటనకు సంబంధించి పల్లవి ప్రశాంత్‌తోపాటు మరికొందరిపైనా ఇప్పటికే కేసులు నమోదు కాగా, తాజాగా విధ్వంసంలో పాల్గొన్న అభిమానులపైనా పోలీసులు కేసు నమోదు చేశారు.

పోలీసులు, బిగ్‌బాస్ షో నిర్వాహకులు హెచ్చరిస్తున్నా వినిపించుకోకుండా ప్రశాంత్ స్టూడియో బయటకు రావడంతోనే విధ్వంసం జరిగినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. రాళ్లదాడి జరుగుతుండడంతో అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు కోరినా ప్రశాంత్ పట్టించుకోకపోవడంతో పరిస్థితి అదుపుతప్పింది. ఈ వ్యవహారానికి సంబంధించి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో రెండు నాన్‌బెయిలబుల్ కేసులు కూడా నమోదయ్యాయి.

వీడియోల ఆధారంగా ఇతర నిందితులను పోలీసులు గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే, ప్రశాంత్‌కు మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసింది ఎవరు? అభిమానులను స్టూడియో వద్దకు రప్పించింది ఎవరన్నదానిపైనా పోలీసులు కూపీ లాగుతున్నారు. మొత్తం 10 బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. పల్లవి ప్రశాంత్ ఈ కేసులో ఏ1 నిందితుడు కాగా, అతడితోపాటే ఉండి అభిమానులను రెచ్చగొట్టిన అతడి సోదరుడు మనోహర్‌ను ఏ2గా, వారి స్నేహితుడు వినయ్‌ను ఏ3గా చేర్చారు.

ఇదే కేసుకు సంబంధించి జూబ్లీహిల్స్ పోలీసులు నిన్న సాయంత్రం ఏ4 నిందితుడు శంతని సాయికిరణ్ (25), ఏ5 నిందితుడు అంకిరావుపల్లి రాజు (23)ను అరెస్ట్ చేశారు. వారి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడైన పల్లవి ప్రశాంత్ కోసం పోలీసు ప్రత్యేక బృందాలు ఆయన సొంతూరు గజ్వేల్ సమీపంలోని కొల్గూరు వెళ్లినట్టు సమాచారం. అయితే,  ప్రశాంత్ తన మొబైల్‌ను స్విచ్చాఫ్ చేసుకుని అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్లినట్టు తెలుస్తోంది.

More Telugu News