IPL-2024: ఎవరీ సమీర్ రిజ్వీ... ఎవరీ కుశాగ్ర... ఎవరీ శుభమ్ దూబే?... ఐపీఎల్ వేలంలో కొట్లు కొల్లగొట్టారు!

  • దుబాయ్ లో ఐపీఎల్ ఆటగాళ్ల మినీ వేలం
  • కొనుగోళ్ల పరంగా రికార్డులు బద్దలు
  • జాతీయ జట్టుకు ఆడని ఆటగాళ్లపైనా కాసుల వర్షం
Uncapped players collects crores in IPL auction

దుబాయ్ లో ఏర్పాటు చేసిన ఐపీఎల్ ఆటగాళ్ల మినీ వేలంలో పలు ఆసక్తికర అంశాలు చోటు చేసుకున్నాయి. అవడానికి ఇది మినీ వేలం అయినా, కొనుగోళ్ల పరంగా గత రికార్డులు బద్దలయ్యాయి. ఆయా ఫ్రాంచైజీలు తాము కోరుకున్న ఆటగాడిని దక్కించుకునేందుకు హోరాహోరీగా పోటీపడ్డాయి. ఆస్ట్రేలియా పేసర్లు మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ లకు రికార్డు స్థాయి ధర పలికిందంటే ఫ్రాంచైజీల మధ్య పోటీనే కారణం. 

తొలుత ప్యాట్ కమిన్స్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ రూ.20.50 కోట్లకు కొనుగోలు చేయడంతో క్రికెట్ ప్రపంచం నివ్వెరపోయింది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన కొనుగోలుగా రికార్డు నమోదైంది. అయితే అది కాసేపే అయింది.

మిచెల్ స్టార్క్ ను రూ.24.75 కోట్లతో కొనుగోలు చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ సరికొత్త చరిత్రను ఆవిష్కరించింది. ఇదంతా ఒకెత్తయితే... అసలు చాలామందికి తెలియని కొందరు ఆటగాళ్లు కూడా నేటి ఐపీఎల్ వేలంలో కోట్లు కొల్లగొట్టారు. 

సమీర్ రిజ్వీ, శుభమ్ దూబే, కుమార్ కుశాగ్ర వంటి కొత్త ఆటగాళ్లకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. వీరిలో సమీర్ రిజ్వీ అత్యధికంగా రూ.8.4 కోట్ల ధర పలికాడు. అతడిని చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే.. రిజ్వీ కనీస ధర రూ.20 లక్షలు. చివరికి వేలంలో రూ.8 కోట్లకు పైగా ధర వచ్చిందంటే, అతని కోసం ఫ్రాంచైజీలు ఎంతలా పోటీపడ్డాయో అర్థం చేసుకోవచ్చు. 

సమీర్ రిజ్వీ ఉత్తరప్రదేశ్ కు చెందిన బ్యాట్స్ మన్. వయసు 20 ఏళ్లే. ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్ లో రిజ్వీ పరుగుల సునామీ సృష్టించాడు. 9 ఇన్నింగ్స్ లలో రెండు సెంచరీల సాయంతో మొత్తం 455 పరుగులు సాధించాడు. ఈ సీజన్ ఆరంభంలో జాతీయ స్థాయిలో నిర్వహించిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలోనూ రిజ్వీ బ్యాట్ తో విజృంభించాడు. ఆ టోర్నీలో మొత్తం 18 సిక్సులు కొట్టాడు. ప్రధానంగా హార్డ్ హిట్టర్ కావడంతో ఫ్రాంచైజీలు అతని కోసం పోటీపడినట్టు అర్థం అవుతోంది. ఇవాళ్టి వేలంలో రిజ్వీ కోసం చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడ్డాయి. అయితే, వేలం పాట రూ.7.6 కోట్ల వద్ద ఉన్నప్పుడు గుజరాత్ టైటాన్స్ తప్పుకోవడంతో... చెన్నై, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య నువ్వానేనా అనే రీతిలో పోటీ కొనసాగింది. చివరికి చెన్నై ఫ్రాంచైజీనే రిజ్వీని చేజిక్కించుకుంది. 

ధోనీ సొంత రాష్ట్రం ఝార్ఖండ్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ కుమార్ కుశాగ్ర కూడా ఐపీఎల్ మినీ వేలంలో జాక్ పాట్ కొట్టాడు. కుమార్ కుశాగ్రను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.7.2 కోట్లతో కొనుగోలు చేసింది. కుశాగ్ర కోసం ఢిల్లీ క్యాపిటల్స్ తో పాటు చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ కూడా పోటీ పడ్డాయి. కానీ ఢిల్లీ భారీ ధరతో కుశాగ్రను దక్కించుకుంది. ఈ కుర్రాడు ఇంకా టీనేజరే. అతడి వయసు 19 ఏళ్లు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన దేవధర్ ట్రోఫీలో అత్యధిక పరుగుల వీరుడు ఇతడే. ఆ టోర్నీలో కుశాగ్ర 5 ఇన్నింగ్స్ లలో 109.13 స్ట్రయిక్ రేట్ తో 227 పరుగులు చేశాడు. విజయ్ హజారే ట్రోఫీలో 37 బంతుల్లో 67 పరుగులు చేయడం ద్వారా కుశాగ్ర అందరి దృష్టిని ఆకర్షించాడు. కుశాగ్ర 2020 అండర్-19 వరల్డ్ కప్ సమయంలో టీమిండియా యువ జట్టులో సభ్యుడు. 

ఇక, విదర్భకు చెందిన మిడిలార్డర్ ఆటగాడు శుభమ్ దూబే కథ కూడా ఇలాంటిదే. ఇప్పటివరకు అతడు టీమిండియాకు ఎంపిక కాలేదు. కానీ ఐపీఎల్ వేలంలో అతడిపై కోట్ల వర్షం కురిసింది. శుభమ్ దూబేని రాజస్థాన్ రాయల్స్ రూ.5.8 కోట్లకు కొనుగోలు చేసింది. ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ పోటీల్లో ఏడు ఇన్నింగ్స్ ల్లో 221 పరుగులు చేశాడు. దూబే స్ట్రయిక్ రేట్ 190 ఉండడమే అతడిపై ఫ్రాంచైజీలు కన్నేయడానికి కారణం. ఈ టోర్నీలో శుభమ్ దూబే బెంగాల్ పై ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి 20 బంతుల్లోనే 58 పరుగులు కొట్టాడు. ఆ మ్యాచ్ లో విదర్భ జట్టు 213 పరుగుల లక్ష్యాన్ని మరో 13 బంతులు మిగిలుండగానే ఛేదించింది. దాంతో దూబే పేరు మార్మోగింది. దూబే కనీస ధర రూ.20 లక్షలే అయినా, ఫ్రాంచైజీల ఆసక్తి కారణంగా అతడికి మంచి ధర లభించింది. 

More Telugu News