Ponnam Prabhakar: నరేంద్రమోదీ ప్రభుత్వంపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు

  • పార్లమెంట్‌లో టియర్ గ్యాస్ ఘటనపై పొన్నం విమర్శలు
  • టియర్ గ్యాస్ ఘటన పార్లమెంటరీ వ్యవస్థకే మచ్చ అని ఆగ్రహం
  • భద్రతపై ప్రశ్నిస్తే ఎంపీలను సస్పెండ్ చేశారని విమర్శ
  • ఘటన జరిగి వారం రోజులు అవుతున్నా దోషులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? అని ప్రశ్న
Minister Ponnam fires at Modi government

నరేంద్రమోదీ ప్రభుత్వంపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్లమెంట్‌లోకి ఇటీవల అగంతుకులు వచ్చి సభ్యులపై టియర్ గ్యాస్ వదిలిన ఘటనపై స్పందిస్తూ... ఈ అంశం మన దేశ పార్లమెంటరీ వ్యవస్థకే మచ్చ అన్నారు. మంగళవారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తోందని విమర్శించారు. పార్లమెంట్ భద్రతపై ప్రశ్నిస్తే ఎంపీలను సస్పెండ్ చేశారని మండిపడ్డారు. ఓ బీజేపీ ఎంపీ సిఫార్సు వల్లే నిందితులకు పాస్‌లు వచ్చాయని, వారిని కాపాడేందుకే అధికార పార్టీ ప్రయత్నిస్తోందన్నారు.

ఈ ఘటన జరిగి వారం రోజులు అవుతున్నా దోషులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? అని పొన్నం ప్రశ్నించారు. పార్లమెంట్ భద్రత అంశంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఎంపీలపై విధించిన సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ నేతలపైనా పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రభుత్వం మారిందని బీఆర్ఎస్ నేతలు గ్రహించాలని సూచించారు. గతంలో బంగారు తెలంగాణ చేశామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారని, అదే నిజమైతే ప్రజావాణికి ప్రజలు ఎందుకు వరుస కడుతున్నారు? అని నిలదీశారు. మేం ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేరుస్తామని పునరుద్ఘాటించారు. హామీల అమలుపై ఎలాంటి సందేహం అవసరం లేదని స్పష్టం చేశారు.

More Telugu News