Daryl Mitchell: ఐపీఎల్ వేలం: చివర్లో ఎంటరై కివీస్ హిట్టర్ ను ఎగరేసుకెళ్లిన సీఎస్కే

  • దుబాయ్ లో ఐపీఎల్ వేలం
  • న్యూజిలాండ్ బ్యాట్స్ మన్ డారిల్ మిచెల్ కు భారీ ధర
  • రూ.14 కోట్లతో కొనుగోలు చేసిన చెన్నై సూపర్ కింగ్స్
  • హర్షల్ పటేల్ కు రూ.11.75 కోట్లు
  • భారీ ధరకు కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్
Daryl Mitchell sold to Chennai Super Kings in IPL auction

ఈసారి ఐపీఎల్ వేలంలో భారీ ధర పలుకుతుందని అంచనా వేసిన ఆటగాళ్లలో న్యూజిలాండ్ హిట్టర్ డారిల్ మిచెల్ ఒకడు. నిలకడగా ఆడుతూ భారీ స్కోర్లు నమోదు చేస్తుండే మిచెల్ కోసం ఫ్రాంచైజీలు పోటీపడతాయని భావించారు. అంచనాలకు తగ్గట్టుగానే నేటి ఐపీఎల్ వేలంలో డారిల్ మిచెల్ కు భారీ ధర పలికింది. ఈ ఆజానుబాహుడిని చెన్నై సూపర్ కింగ్స్ రూ.14 కోట్లకు కొనుగోలు చేసింది. 

డారిల్ మిచెల్ కనీస ధర రూ.1 కోటి. అతడి కోసం పలు ఫ్రాంచైజీలు వేలం పాటను పెంచేశాయి. అతడి కోసం తొలి దశలో చెన్నై ఎలాంటి ప్రయత్నం చేయలేదు. వ్యూహాత్మకంగా మౌనంగా ఉండిపోయింది. అయితే, రూ.11 కోట్ల పాట వద్ద ఎంటరైన చెన్నై ఫ్రాంచైజీ వర్గాలు... రూ.14 కోట్లతో అతడిని ఎగరేసుకెళ్లాయి. 

వాస్తవానికి, డారిల్ మిచెల్ ను చెన్నై ఫ్రాంచైజీ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయని వేలానికి కొన్ని రోజుల ముందే కథనాలు వచ్చాయి. అయితే, వేలం మొదలయ్యాక అతడి కోసం చెన్నై ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. వారిని మరింత ఆశ్చర్యానికి గురిచేస్తూ చివర్లో ఎంటరైన చెన్నై... తాను కోరుకున్న ఆటగాడిని వ్యూహాత్మకంగా చేజిక్కించుకుంది. 

ఇక, ఈసారి వేలంలో జాక్ పాట్ కొట్టినవాళ్లలో హర్షల్ పటేల్ కూడా ఉన్నాడు. అతడిని వేలంలో రూ.11.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. అతడికి అంత ధర లభించడం క్రికెట్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. అంత ప్రతిభావంతుడే అయితే టీమిండియాలో ఉండేవాడు కదా అని క్రికెట్ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. 

ఇక, ఇంగ్లండ్ పేసర్ క్రిస్ వోక్స్ ను రూ.4.2 కోట్లకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. దక్షిణాఫ్రికా కొత్త పేసర్ గెరాల్డ్ కోట్జీ కూడా ఈ వేలంలో మెరుగైన ధర అందుకున్నాడు. మొన్నటి వరల్డ్ కప్ ద్వారా అందరి దృష్టిలో పడిన కోట్జీ కనీస ధర రూ.2 కోట్లు కాగా... అతడిని వేలంలో ముంబయి ఇండియన్స్ రూ.5 కోట్లకు కైవసం చేసుకుంది.

More Telugu News