Talasani: ఫైళ్ల మాయం కేసులో పోలీసుల ముందుకు తలసాని మాజీ ఓఎస్డీ

  • సోమవారం నాంపల్లి పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్షమైన కల్యాణ్
  • రాత్రి వరకు ప్రశ్నించిన పోలీస్ అధికారులు
  • ముందస్తు బెయిల్ కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న కల్యాణ్
Thalasani Srinivas Yadav OSD Apppeared Infront Of Nampally Police In File Theft Case

పశుసంవర్థక శాఖలో పలు ఫైళ్లు మాయం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపిస్తున్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కల్యాణ్ సోమవారం నాంపల్లి పోలీస్ స్టేషన్ లో హాజరయ్యారు. పోలీసులు ఆయనను రాత్రి వరకూ ప్రశ్నించి పలు వివరాలు రాబట్టారు. గత ప్రభుత్వంలో తలసాని పశుసంవర్థక మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అప్పట్లో కల్యాణ్ ఆయన వద్ద ఓఎస్ డీ గా విధులు నిర్వర్తించారు. ప్రభుత్వం మారిన తర్వాత ఓఎస్డీ కల్యాణ్ పోస్టు పోయింది.

అయితే, ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మూడు రోజులకు కల్యాణ్ తన పాత ఆఫీసుకు వచ్చారు. సాయంత్రం పూట ఆఫీసుకు చేరుకున్న కల్యాణ్.. కొంతమంది ఉద్యోగుల సాయంతో పలు ఫైళ్లను చింపేశారు. చిత్తు కాగితాలను మూటకట్టి తీసుకెళ్లిపోయాడు. ఆఫీస్ వాచ్ మెన్ ఫిర్యాదుతో ఈ నెల 9న ఆయనపై నాంపల్లి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. శాఖలో పలు కీలక ఫైళ్లు మాయమయ్యాయని, వాటిని కల్యాణ్ తీసుకెళ్లాడంటూ చార్జిషీట్ దాఖలు చేశారు.

ఈ కేసులో అరెస్టును తప్పించుకునేందుకు కల్యాణ్ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో విచారణకు రమ్మంటూ పోలీసులు పిలవడంతో సోమవారం నాంపల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చారు. పోలీసులు ఆయనను సుదీర్ఘంగా విచారించారు. రాత్రి 9 వరకు కూడా కల్యాణ్ ను ప్రశ్నించినట్లు సమాచారం.

More Telugu News