IPL 2024: స్టీవ్ స్మిత్‌ను ఐపీఎల్ వేలంలో ఎవరూ కొనరు.. మాజీ దిగ్గజం సంచలన వ్యాఖ్యలు

  • ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు, సన్‌రైజర్స్ మాజీ కోచ్ టామ్ మూడీ ఆసక్తికర వ్యాఖ్యలు
  • శామ్ కర్రాన్ రూ.18.50 కోట్ల రికార్డును మిచెల్ స్టార్క్ బద్దలు కొడతాడని జోస్యం
  • వేలం తర్వాత కూడా గుజరాత్ టైటాన్స్ వద్దే ఎక్కువ డబ్బు మిగులుతుందన్న మూడీ
No one will buy Steve Smith in the IPL 2024 auction says Tom moody

దుబాయ్ వేదికగా మంగళవారం (నేడు) జరగనున్న ఐపీఎల్ 2024 మినీ వేలంలో అత్యధిక ధర పలకనున్న ఆటగాడు ఎవరనేది ఆసక్తికరంగా మారింది.  ఆస్ట్రేలియాకు చెందిన పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ట్రావిస్ హెడ్ వంటి స్టార్లు వేలానికి అందుబాటులో ఉన్న ఆటగాళ్ల జాబితాలో ఉండడంతో ఆసక్తి నెలకొంది. ఆసీస్ ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు ఎక్కువ మొత్తంలో వెచ్చించనున్నాయనే అంచనాలు నెలకొన్నాయి.  ఈ నేపథ్యంలో ఆసీస్ మాజీ ఆటగాడు, సన్‌రైజర్స్ మాజీ కోచ్ టామ్ మూడీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో అమ్ముడు పోతాడని తాను భావించడంలేదని టామ్ మూడీ అంచనా వేశారు. ఇక ఐపీఎల్ వేలంలో ఇంగ్లండ్ ఆటగాడు శామ్ కర్రాన్ పేరిట ఉన్న రూ.18.50 కోట్ల ఆల్-టైమ్ రికార్డు వేలం ధరను మిచెల్ స్టార్క్ బద్దలు కొడతాడని జోస్యం చెప్పాడు. ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ వేలంపై వరల్డ్ కప్ గణనీయమైన ప్రభావం చూపుతుందని,  వరల్డ్ కప్‌లో రాణించిన ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టే అవకాశం ఉందని అన్నాడు. పంజాబ్ కింగ్స్ విడుదల చేసిన తమిళనాడు క్రికెటర్ షారుఖ్ ఖాన్‌ను చెన్నై సూపర్ కింగ్స్‌ దక్కించుకునే అవకాశం ఉందని టామ్ మూడీ పేర్కొన్నాడు. వేలం తర్వాత కూడా గుజరాత్ టైటాన్స్ వద్దే ఎక్కువ మొత్తం మిగులుతుందని అన్నాడు.

ఐపీఎల్ 2024 వేలంలో మొత్తం 333 మంది క్రికెటర్లు అందుబాటులో ఉన్నారు. ఇందులో 214 మంది భారతీయ ఆటగాళ్లు, 119 మంది విదేశీ ఆటగాళ్లు. విదేశీ ఆటగాళ్ల కోసం గరిష్ఠంగా 77 స్లాట్‌లు అందుబాటులో ఉన్నాయి. రూ.2 కోట్ల బేస్ ధరలో 23 మంది ఆటగాళ్లు, రూ.1.5 కోట్ల బేస్ ధరలో 13 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. కాగా ఐపీఎల్ 2024 మినీ వేలంలో పాల్గొననున్న ఐపీఎల్ ఫ్రాంచైజీలలో గుజరాత్ టైటాన్స్ అత్యధికంగా రూ. 38.15 కోట్లు ఉన్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ వద్ద రూ. 34 కోట్లు, . కోల్‌కతా నైట్ రైడర్స్ వద్ద రూ. 32.7 కోట్లు, చెన్నై సూపర్ కింగ్స్ వద్ద రూ. 31.4 కోట్లు, పంజాబ్ కింగ్స్ వద్ద రూ. 29.1 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద రూ. 28.95 కోట్లు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వద్ద రూ. 23.25 కోట్లు, ముంబై ఇండియన్స్ వద్ద రూ. 17.75 కోట్లు, రాజస్థాన్ రాయల్స్ వద్ద రూ. 14.5 కోట్లు, లక్నో సూపర్ జెయింట్స్ వద్ద రూ. 13.15 కోట్లు చొప్పున డబ్బులు ఉన్నాయి.

More Telugu News