Liquor Sales: మద్యం అమ్మకాలు, వినియోగంలో తెలంగాణ టాప్.. లీటర్లు లీటర్లు తాగేస్తున్నారు!

Telangana top in liquor sales and consumption in south india
  • దక్షిణాదిలో మద్యం వినియోగం, ఆదాయంలో తెలంగాణదే అగ్రస్థానం
  • జనాభా తక్కువైనా వినియోగం ఫుల్
  • ఒక్కొక్కరు సగటున 9 లీటర్ల లిక్కర్, 10.7 లీటర్ల బీర్లు వినియోగం
  • 2022-23లో మద్యం ద్వారా తెలంగాణకు రూ.33,268 కోట్ల ఆదాయం
తెలంగాణలో మద్యం అమ్మకాలు, వినియోగంపై ఎక్సైజ్‌శాఖ అధికారులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సమర్పించిన నివేదికలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలైన ఏపీ, తమిళనాడు, కేరళకు మించి ఇక్కడ మద్యం వినియోగిస్తున్నట్టు పేర్కొన్నారు. అంటే దక్షిణాదిలో లిక్కర్ వినియోగంలో తెలంగాణది టాప్ ప్లేస్. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం కూడా భారీగానే సమకూరుతోందని తెలిపారు.

2011 జనాభా లెక్కల ప్రకారం తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో జనాభా ఎక్కువ.. మద్యం అమ్మకాలు తక్కువగా ఉండగా, తెలంగాణలో మాత్రం జనాభా తక్కువ.. మద్యం అమ్మకాలు ఎక్కువగా ఉన్నట్టు తేలింది. ఎక్సైజ్ అధికారుల నివేదిక ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ జనాభా 4.93 కోట్లు. 2022-23లో అక్కడ 3.35 కోట్ల లిక్కర్ (ఐఎంఎల్) కేసులు అమ్ముడుపోయాయి. దీనినిబట్టి అక్కడ తలసరి మద్యం వినియోగం 6.04 లీటర్లు. 1.16 కోట్ల కేస్‌ల బీర్లు అమ్ముడయ్యాయి. అంటే తలసరి బీర్ల వినియోగం 1.86 లీటర్లు. తమిళనాడులో తలసరి మద్యం వినియోగం 7.66 లీటర్లు కాగా, బీర్ల వినియోగం 3.75 లీటర్లు. ఇక, తెలంగాణతో దాదాపు సమాన జనాభా కలిగిన కేరళలో తలసరి లిక్కర్ వినియోగం 5.93 లీటర్లు కాగా, బీర్ల వినియోగం 2.63 లీటర్లు. 

తెలంగాణ విషయానికి వస్తే.. ఇక్కడ తలసరి మద్యం వినియోగం 9 లీటర్లుగా, బీర్ల వినియోగం 10.7 లీటర్లుగా ఉంది. లిక్కర్ వినియోగంలోనే కాదు, ఆదాయంలోనూ రాష్ట్రం టాప్‌లో ఉంది. 2022-23లో తెలంగాణలో రూ.33,268 కోట్ల ఆదాయం వస్తే, ఏపీలో రూ.23,804 కోట్లు, కర్ణాటకలో రూ.29,790 కోట్లు, కేరళలో రూ. 16,189 కోట్ల ఆదాయం మద్యం అమ్మకాల ద్వారా సమకూరింది.

తెలంగాణలో ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న మద్యం వినియోగాన్ని నియంత్రించాలని భావిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మకాలను నియంత్రించాలని నిర్ణయించింది. బెల్టుషాపులను పూర్తిగా ఎత్తివేయాలని భావిస్తోంది. అలాగే, బార్లు, వైన్‌షాప్‌లపైనా నియంత్రణ విధించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
Liquor Sales
Liquor Consumption
Telangana
Telangana Excise Department
Revanth Reddy

More Telugu News