Free Bus: మాకు ఉచితం వద్దు.. టికెట్ తీసుకునే వెళ్తాం.. ఖమ్మం మహిళా టీచర్ల తీర్మానం

  • ఎం.వెంకటాయపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల టీచర్ల నిర్ణయం
  • ఉచిత సౌకర్యాన్ని పేదలు, వృద్ధులకు, కాలేజీ పిల్లలకు వదిలేయాలని నిర్ణయం
  • టీచర్ల నిర్ణయంపై ప్రశంసలు
We dont want free bus service buy ticket and travel says Khammam teachers

తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో కల్పించిన ఉచిత ప్రయాణాన్ని తాము ఉపయోగించుకోబోమని, తాము టికెట్ తీసుకునే ప్రయాణిస్తామని ఖమ్మం జిల్లా మహిళా ఉపాధ్యాయులు తేల్చి చెప్పారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని పేదలు ఉపయోగించుకుంటే చాలని, అది వారికి అవసరం కూడా అని వారు పేర్కొన్నారు. తమకు టికెట్ తీసుకుని ప్రయాణంచేంత ఆర్థిక స్వేచ్ఛ ఉందని తెలిపారు. ఈ మేరకు అందరూ కలిసి ఫ్రీ బస్ సౌకర్యాన్ని ఉపయోగించుకోకూడదని తీర్మానం చేసుకున్నారు.


ఖమ్మం రూరల్ మండలం ఎం.వెంకటాయపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులు ఈ మేరకు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సౌకర్యాన్ని కాలేజీ విద్యార్థులు, పేదలు, వృద్ధులకు వదిలేయాలని నిర్ణయించారు. తమ నిర్ణయం వల్ల ఆర్టీసీకి అండగా ఉన్నామన్న తృప్తితోపాటు ఆటో కార్మికులకు ఉపాధి లభిస్తుందన్న సంతృప్తి లభిస్తుందని పేర్కొన్నారు. వీరు తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే, బస్సుల్లో వీరికి డబ్బులు తీసుకుని టికెట్ ఇస్తారా? లేదా? అన్న అనుమానాన్ని మరికొందరు వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News