Team India: డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లిన టీమిండియా.. పాక్ ఓటమే కారణం

  • తొలి టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో పాక్ ఘోర ఓటమితో మారిన గణాంకాలు
  • గెలుపు శాతంలో సమానంగా నిలిచిన భారత్, పాకిస్థాన్
  • పాక్ ఖాతాలో ఒక ఓటమి ఉండడంతో టాప్‌లో నిలిచిన టీమిండియా
Team India has jumped to the top of the WTC points table after Pakistan lost to australia in 1st test

డబ్ల్యూటీసీ 2023-25 (వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్) పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానానికి దూసుకెళ్లింది. పెర్త్‌ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా చేతిలో పాకిస్థాన్ ఏకంగా 360 పరుగుల తేడాతో ఘోర ఓటమి పాలవ్వడం భారత్‌కు కలిసొచ్చింది. పాకిస్థాన్‌(24) వద్ద భారత్ (16) కంటే ఎక్కువ పాయింట్లే ఉన్నప్పటికీ గెలుపు శాతం విషయంలో ఇరు జట్లు 66.67 శాతంతో సమానంగా వున్నాయి. 

ఈ ఏడాది టీమిండియా ఒకే టెస్టు సిరీస్ ఆడింది. జులైలో వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌ను 1-0తో గెలిచింది. ఒక మ్యాచ్‌లో విజయం సాధించగా మరో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. దీంతో భారత్ ఖాతాలో 16 పాయింట్లు ఉన్నాయి. మరోవైపు పాకిస్థాన్‌ ఈ ఏడాది శ్రీలంకపై 2-0 తేడాతో గెస్టు సిరీస్‌ను గెలుచుకుంది. అయితే ఆస్ట్రేలియాపై 3 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్‌‌లో ఓటమి పాలవ్వడంతో పాక్ గెలుపు శాతం దిగజారింది. దీంతో భారత్, పాకిస్థాన్ సమానంగా ఉన్నాయి. అయితే పాకిస్థాన్‌ ఖాతాలో ఒక ఓటమి కూడా ఉండడంతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది.

ఆస్ట్రేలియాపై మిగతా రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడితే పాకిస్థాన్ మరింత కిందికి దిగజారే అవకాశం ఉంటుంది. ఒక్క మ్యాచ్‌లోనైనా గెలిస్తే మెరుగ్గా ఉంటుంది. కాగా ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా 5వ స్థానంలో, న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌లు వరుసగా మూడు, నాలుగవ స్థానాల్లో ఉన్నాయి. అయితే ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌ లో మరో రెండు టెస్టులు జరగనుండడం, న్యూజిలాండ్ వర్సెస్ దక్షిణాఫ్రికా, అంతకంటే ముందు ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా, ఆ తర్వాత భారత్ వర్సెస్ ఇంగ్లండ్ 5 టెస్టుల సిరీస్, బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంకతో 2 టెస్టు మ్యాచ్‌ సిరీస్‌లు ఆడాల్సి ఉంది. దీంతో పాయింట్ల పట్టిక మారిపోవడం ఖాయం. కాగా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా రెండుసార్లు ఫైనల్ చేరినా టైటిల్ దక్కని విషయం తెలిసిందే.

More Telugu News