Jai Shankar: ఐరాస భద్రతామండలిపై విమర్శనాస్త్రాలు సంధించిన విదేశాంగ మంత్రి జై శంకర్ 

  • ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత్ కు లభించని స్థానం
  • ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న వ్యవహారం
  • ఐరాస భద్రతామండలిని పాత క్లబ్బుతో పోల్చిన జై శంకర్
Jai Shankar slams UN Security Council

ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత్ కు కూడా స్థానం కల్పించే అంశం ఎన్నో ఏళ్లుగా సాగతీతకు గురవుతోంది. ప్రపంచంలో ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంటూ, శాస్త్ర సాంకేతిక, వైద్య రంగాల్లో ఆవిష్కరణలతో, అంతరిక్ష పరిశోధన రంగంలో అగ్రరాజ్యాలకు సాధ్యం కాని ఘనతలను కూడా సాధిస్తున్న తమకు భద్రతామండలిలో సభ్యత్వం ఇవ్వకపోడం పట్ల భారత్ పలు వేదికలపై అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.

తాజాగా ఇదే అంశంపై భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ స్పందించారు. ఐరాస భద్రతామండలి ఓ 'పాత క్లబ్బు' వంటిదని, అందులో సభ్యదేశాలు కొత్త దేశాలకు చోటు ఇవ్వడానికి అయిష్టత ప్రదర్శిస్తుంటాయని విమర్శించారు. బెంగళూరులో రోటరీ ఇన్ స్టిట్యూట్-2023 కార్యక్రమంలో మాట్లాడుతూ జై శంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ పాత క్లబ్బు సభ్యులు తమ విధానాలను సమీక్షించుకోవడానికి కూడా ఇష్టపడరని జై శంకర్ వ్యాఖ్యానించారు. 

"ఆ సభ్యులు తమ పట్టు సడలిపోవడాన్ని ఏమాత్రం అంగీకరించరు... భద్రతామండలిపై తమ పెత్తనమే కొనసాగాలని కోరుకుంటారు. కొత్త సభ్యదేశాలు భద్రతామండలిలోకి వస్తే తమ విధానాలను ప్రశ్నిస్తాయని వారికి భయం. ఇవాళ మానవాళికి అనేక సమస్యలు హానికరంగా మారాయి. ప్రపంచం ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఐక్యరాజ్యసమితి ఏమంత ప్రభావం చూపలేకపోతోంది" అని జై శంకర్ వివరించారు.

More Telugu News