Sai Sudarshan: అరంగేట్రంలోనే అదరగొట్టిన కొత్త కుర్రాడు... తొలి వన్డేలో టీమిండియా ఘనవిజయం

Sai Sudarshan makes good start in his career first match with half century
  • జొహాన్నెస్ బర్గ్ లో తొలి వన్డే
  • దక్షిణాఫ్రికాపై 8 వికెట్ల తేడాతో నెగ్గిన టీమిండియా
  • అర్ధసెంచరీతో అలరించిన సాయి సుదర్శన్
  • 9 ఫోర్లతో 55 పరుగులు చేసిన తమిళనాడు కుర్రాడు
ఇవాళ జొహాన్నెస్ బర్గ్ లో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఆతిథ్య దక్షిణాఫ్రికాను ఓడించింది. కెరీర్ లో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న తమిళనాడు కుర్రాడు సాయి సుదర్శన్ అర్ధసెంచరీతో రాణించడం విశేషం. 

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 27.3 ఓవర్లలో 116 పరుగులకే కుప్పకూలింది. అర్షదీప్ సింగ్ 5, అవేష్ ఖాన్ 4 వికెట్లతో రాణించారు. అనంతరం... 117 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా కేవలం 2 వికెట్లు కోల్పోయి 16.4 ఓవర్లలోనే ఛేదించింది. 

ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (5) స్వల్ప స్కోరుకే అవుటైనప్పటికీ... కొత్త కుర్రాడు సాయి సుదర్శన్ అదరగొట్టాడు. సీనియర్ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ తో కలిసి కీలక భాగస్వామ్యంతో టీమిండియాను విజయం దిశగా నడిపించాడు. 22 ఏళ్ల ఎడమచేతివాటం సాయి సుదర్శన్ 43 బంతుల్లో 9 ఫోర్లతో 55 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. శ్రేయాస్ అయ్యర్ 45 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ తో 52 పరుగులు చేసి అవుటయ్యాడు. 

దక్షిణాఫ్రికా బౌలర్లలో వియాన్ ముల్డర్ 1, ఆండిలే ఫెహ్లుక్వాయో 1 వికెట్ తీశారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ లో టీమిండియా 1-0తో ముందంజ వేసింది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే డిసెంబరు 19న కెబెరాలో జరగనుంది.
Sai Sudarshan
Team India
South Africa
1st ODI
Johannesburg

More Telugu News