IAS: విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బుర్రా వెంకటేశం, వైద్య శాఖ కార్యదర్శిగా క్రిస్టినా... తెలంగాణలో ఐఏఎస్ ల బదిలీలు

  • ఇటీవల తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్
  • అధికార యంత్రాంగంలో మార్పులు చేర్పులు చేపట్టిన రేవంత్ రెడ్డి సర్కారు
  • తాజాగా రాష్ట్రంలో 11 మంది ఐఏఎస్ లకు స్థానచలనం
Telangana govt transfers IAS officers

తెలంగాణలో నూతనంగా అధికారం చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికార యంత్రాంగంలో మార్పులు చేర్పులు చేస్తోంది. తాజాగా, 11 మంది ఐఏఎస్ లను ఇతర పోస్టులకు బదిలీ చేసింది. తాజా బదిలీలపై రాష్ట్ర సీఎస్ శాంతికుమారి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. 

విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బుర్రా వెంకటేశంను నియమించారు. ఆయనకు కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ గా అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు. వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిగా క్రిస్టినాను నియమించారు. 

ప్రస్తుతం మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న అర్వింద్ కుమార్ ను విపత్తు నిర్వహణ శాఖకు బదిలీ చేశారు. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శిగా దాన కిశోర్ ను నియమించిన ప్రభుత్వం, ఆయనకు సీడీఎంఏ, హెచ్ఎండీఏ కమిషనర్ గా అదనపు బాధ్యతలు అప్పగించింది. 

ఇక, నల్గొండ జిల్లా కలెక్టర్ గా ఉన్న ఆర్.వి.కర్ణన్ ను వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ గా నియమించారు. జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ గా సుదర్శన్ రెడ్డి, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా వాకాటి కరుణ, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ గా టీకే శ్రీదేవి, రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శిగా కేఎస్ శ్రీనివాసరాజును నియమించారు. 

అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణీ ప్రసాద్ ను నియమించిన ప్రభుత్వం... ఈపీటీఆర్ఐ డీజీగా అదనపు బాధ్యతలను కూడా అప్పగించింది. సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిగా రాహుల్ బొజ్జాను నియమించారు. ఆయనకు ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు కేటాయించారు.

More Telugu News