Raghuram Rajan: అదే జరిగితే 2047లోనూ భారత్ మధ్యాదాయ దేశంగానే ఉంటుంది: ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్‌ రాజన్

India may remain a middle income by 2047 says Raghuram rajan
  • భారత్‌ను సంపన్న దేశంగా మార్చేందుకు ప్రస్తుత వృద్ధిరేటు సరిపోదన్న రఘురామ్ రాజన్
  • పరిస్థితి ఇలాగే ఉంటే 2047లోనూ భారత్ మధ్యాదాయ దేశంగా ఉంటుందని వెల్లడి
  • అప్పటికి దేశంలో వృద్ధుల జనాభా పెరిగి ఆర్థిక వ్యవస్థపై భారం పడుతుందని వార్నింగ్
దేశంలో ఆర్థికాభివృద్ధి ప్రస్తుతమున్న ఆరు శాతానికే పరిమితమైతే 2047లో కూడా భారత్ మధ్యాదాయ దేశంగా మిగిలిపోతుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ హెచ్చరించారు. అప్పటికి జనాభాలో వృద్ధుల శాతం కూడా పెరిగి ఆర్థిక వ్యవస్థపై మరింత భారం పడుతుందన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ మేరకు హెచ్చరికలు జారీ చేశారు. 

‘‘ఆర్థికాభివృద్ధి ఏటా 6 శాతంగా ఉందనుకుందాం. అది ప్రతి 12 ఏళ్లకూ రెట్టింపు అవుతుందనుకుంటే 24 ఏళ్లల్లో తలసరి ఆదాయం నాలుగు రెట్లు పెరుగుతుంది. అంటే.. ఇప్పుడున్న 2,500 డాలర్ల తలసరి ఆదాయం 10 వేల డాలర్లకు పెరుగుతుంది. దీంతో, 2047కి కూడా మనం మధ్యాదాయ దేశంగానే మిగిలిపోతాం’ అని ఆయన పేర్కొన్నారు. 

2047 కల్లా దేశంలో వృద్ధుల సంఖ్య కూడా పెరుగుతుందని రఘురామ్ రాజన్ హెచ్చరించారు. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటు తగ్గిందని వెల్లడించారు. వేగంగా అభివృద్ధి సాధించకపోతే భారత్ సుసంపన్నం అయ్యే లోపే వృద్ధాప్యం మీద పడుతుందని, జనాభాలో పెరిగిన వృద్ధుల భారం ఆర్థికవ్యవస్థపై పడుతుందని హెచ్చరించారు. ప్రస్తుత ఆర్థికవృద్ధి రేటు ఉద్యోగాల కల్పనకు సరిపోదన్నారు. వృద్ధుల జనాభా పెరిగే లోపే భారత్ ను సంపన్న దేశంగా మార్చేందుకు ప్రస్తుత వృద్ధిరేటు సరిపోదని తేల్చి చెప్పారు.
Raghuram Rajan
India

More Telugu News