auto: మూడు రంగుల జెండా మూడు చక్రాల ఆటో కార్మికుల జీవితాల్లో చీకటిని నింపింది: ఆటో యూనియన్

Auto Union fires at government for free bus to women
  • మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తమ పొట్ట కొట్టిందంటూ పలు జిల్లాల్లో నిరసనలు
  • బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఆటోలు నడిపిస్తున్నామని వెల్లడి
  • ఈ పథకంపై పునారాలోచన చేయాలని విజ్ఞప్తి
మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తమ పొట్ట కొట్టిందని పలు జిల్లాలో ఆటో కార్మికులు ఆందోళనలు నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమలు చేసిన పథకం ఆటో కార్మికులకు నష్టం చేసిందన్నారు. 

వివిధ జిల్లాల్లో ఆందోళన చేసిన ఆటో డ్రైవర్లు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుచోట్ల ర్యాలీలు నిర్వహించారు. సిద్దిపేట, మెదక్, జగిత్యాల తదితర జిల్లాల్లో ఆందోళనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ... మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల తమకు ఉపాధి తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు.

సిద్దిపేటలో ఆటో క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అధ్యక్షుడు సాయిరామ్ మాట్లాడుతూ... తాము బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఆటోలను నడిపిస్తున్నామని, ఇప్పుడు ఈ పథకం వల్ల పూట గడవని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఒకవైపు ఆటో ఈఎంఐలు, మరోవైపు కుటుంబ పోషణ భారంగా మారుతోందన్నారు. మూడు రంగుల జెండా మూడు చక్రాల ఆటో కార్మికుల జీవితాల్లో చీకటిని నింపిందన్నారు. లక్షలాది ఆటో కార్మికుల జీవితాలు రోడ్డున పడ్డాయన్నారు. 

ఆటో కార్మికుల జీవితం కోసం ఈ పథకంపై కాంగ్రెస్ పునరాలోచన చేయాలని పలువురు విజ్ఞప్తి చేశారు. లేదంటే ఆటో కార్మికులకు నెలకు రూ.15 వేల భృతిని అందించాలని డిమాండ్ చేశారు.
auto
Telangana
Congress

More Telugu News