Nara Lokesh: జగన్ యాదవులకు చేసిన మోసాల్లో ఇవి కొన్నే: నారా లోకేశ్

  • ఉమ్మడి విశాఖ జిల్లాలో లోకేశ్ యువగళం
  • యలమంచిలి నియోజకవర్గంలో యాదవులతో లోకేశ్ ముఖాముఖి
  • లోకేశ్ కు తమ సమస్యలు వివరించిన యాదవులు
  • అధికారంలోకి రాగానే యాదవులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్న లోకేశ్
Lokesh held meeting with Yadava community people

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఉమ్మడి విశాఖ జిల్లాలో కొనసాగుతోంది. ఇవాళ ఆయన యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గం జీవీఎంసీ 82వ వార్డులో యాదవులతో ముఖాముఖి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాదవులు లోకేశ్ కు తమ సమస్యలు వివరించారు. 

"టీడీపీ హయాంలో గొర్రెల కొనుగోలు కోసం సబ్సిడీ రుణాలు ఇచ్చేవారు. జగన్ పాలనలో గొర్రెల కొనుగోలు కోసం రుణాలు ఇవ్వడం లేదు. యాదవులు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో కృష్ణుడి గుడి కట్టుకోవడానికి సాయం అందించాలి. 50 ఏళ్లు దాటిన గొర్రెల పెంపకం దారులకు పెన్షన్ ఇవ్వాలి. టీటీడీ బోర్డులో యాదవులకి ప్రత్యేక స్థానం కల్పించాలి. యాదవులకు మరిన్ని రాజకీయ అవకాశాలు కల్పించాలి. 

జగన్ ప్రభుత్వం యాదవ కార్పొరేషన్ ని నిర్వీర్యం చేశాడు... ఒక్క రుణం ఇవ్వడం లేదు. జగన్ పాలనలో ఒక్క యాదవ భవనం కట్టలేదు. మేము పశువులు మేపుకునే భూములు వైసీపీ ప్రభుత్వం వెనక్కి లాక్కుంది. గొర్రెలు చనిపోతే టీడీపీ హయాంలో ఇన్స్యూరెన్స్ ఇచ్చేవారు. జగన్ పాలనలో ఇన్స్యూరెన్స్ ఇవ్వడం లేదు" అంటూ యాదవ సామాజికవర్గం ప్రతినిధులు ఆరోపించారు. 

 లోకేశ్ మాట్లాడుతూ...

జై యాదవ్... జై మాధవ్. యాదవ అనేగానే పౌరుషం గుర్తు వస్తుంది. యాదవులకు ఆర్ధిక, రాజకీయ స్వాతంత్య్రం ఇచ్చింది అన్న ఎన్టీఆర్ గారు. టీడీపీ ప్ర‌భుత్వంలో  రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడుకి ప‌ద‌విస్తే... జగ‌న్ రెడ్డి ఆర్థిక శాఖా మంత్రిగా బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డికి ఇచ్చారు. నాడు టీడీపీ ప్రభుత్వం టీటీడీ ఛైర్మన్ గా పుట్టా సుధాకర్ యాదవ్ ని నియమిస్తే...జ‌గ‌న్ త‌న బాబాయ్ సుబ్బారెడ్డిని, ఇప్పుడు బంధువు భూమ‌న క‌రుణాకర్ రెడ్డిల‌ను టీటీడీ చైర్మ‌న్ చేశారు. 

చంద్ర‌బాబు గారు ఏపీఐఐసీ ఛైర్మన్ కృష్ణయ్య యాదవ్ కి ఇస్తే, జ‌గ‌న్ ప్రభుత్వంలో రోజారెడ్డికి ఇచ్చారు. టీడీపీ తుడా ఛైర్మన్ గా నర్సింహ యాదవ్ ని చేస్తే, వైసీపీ ముందుగా చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డిని చేసింది... ఇప్పుడు వాళ్ల‌బ్బాయి చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి అప్ప‌గించారు.... నా బీసీలు అంటూనే జ‌గ‌న్ రెడ్డి యాదవుల‌కి చేసిన మోసాలలో ఇవి కొన్నే. టీడీపీ ఆవిర్భావం నుంచీ యాద‌వుల‌కు స‌ముచిత స్థానం క‌ల్పిస్తోంది.

బీదా రవిచంద్రయాదవ్ - ఎమ్మెల్సీ
గుండుముల తిప్పేస్వామి - ఎమ్మెల్సీ
బచ్చుల అర్జునుడు - ఎమ్మెల్సీ
రెడ్డయ్య- మచిలీపట్నం ఎంపీ... ఇలా అనేక పదవులు ఇచ్చాం.

టీడీపీ హయాంలో యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఐదేళ్లలో (2014-19) రూ.278 కోట్లు ఖర్చు చేశాం. 90 శాతం సబ్సిడీతో ఆదరణ పథకం ద్వారా పరికరాలు అందించాం. గొర్రెలు, మేకల కొనుగోలుకు కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించాం. యాదవుల‌ను ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగా ప్రోత్సహించాం. 

యాద‌వ కార్పొరేష‌న్ కు నిధులివ్వ‌ని జ‌గ‌న్ యాద‌వుల‌పై క‌క్ష క‌ట్టి మ‌రీ దాడులు చేయించారు. అక్ర‌మ కేసులు బ‌నాయించారు. పెళ్లిలో అక్షింతలు వేశారనే నెపంతో యనమల రామకృష్ణుడిపై అట్రాసిటీ కేసు పెట్టారు. అసెంబ్లీ సాక్షిగా బీదా రవిచంద్ర యాదవ్‌పై దాడికి పాల్పడ్డారు. బచ్చుల అర్జునుడిపై తప్పుడు కేసులు పెట్టి వేధించారు. పల్లా శ్రీనివాస్, అతని సోదరుని ఆస్తుల్ని ధ్వంసం చేశారు.

టీడీపీ అధికారంలోకి రాగానే.... కృష్ణుడి ఆలయాలు కట్టడానికి ప్రభుత్వం నేరుగా నిధులు కేటాయిస్తుంది. దామాషా ప్రకారం యాదవులకు రాజకీయ అవకాశాలు కల్పిస్తాం. యాదవులకు కమ్యూనిటీ భవనాలు ఏర్పాటు చేస్తాం. గొర్రెలు చనిపోతే ఇన్స్యూరెన్స్ అందిస్తాం. 

ఉత్తరాంధ్రలో ఉన్న యాదవులు బీసీ-బి లో ఉండాలని కోరుకుంటున్నారు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే బీసీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తాం. ఎంపీ సీటుతో పాటు నామినేటెడ్ పోస్టులు కూడా యాదవ సామాజికవర్గం ప్రతినిధులకు కేటాయిస్తాం.

More Telugu News