Smitha Sabarwal: మంత్రి సీతక్కతో స్మిత సబర్వాల్ భేటీ.. ఫొటోలు ఇవిగో!

  • మిషన్ భగీరథ కార్యకలాపాలపై సమీక్ష
  • సెక్రెటరీ హోదాలో స్మిత సబర్వాల్ హాజరు
  • వచ్చే వేసవిలో తాగునీరందని పరిస్థితి ఉండొద్దన్న మంత్రి సీతక్క
  • గ్రామాలకు తాగునీరందించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచన
IAS Smitha Sabarwal Meeting With Minister Seethakka

తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్కతో ఐఏఎస్ స్మిత సబర్వాల్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మిషన్ భగీరథ కార్యకలాపాలపై మంత్రి సీతక్క శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి సమీక్షకు వచ్చిన సీతక్కకు ఉద్యోగులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సీతక్క మాట్లాడుతూ.. తనను స్వాగతించిన ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు. తనను ప్రత్యేకంగా చూడాల్సిన అవసరంలేదని, మీలో ఒకరిగానే భావించాలని చెప్పారు. మనందరి ముందు పెద్ద టాస్క్ ఉందని అన్నారు. గ్రామీణ ప్రాంతాలకు తాగు నీరు అందించే విషయానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. వచ్చే వేసవిలో గ్రామాలకు తాగు నీరందని పరిస్థితి ఉండొద్దని చెప్పారు.

ఈ మీటింగ్ కు మిషన్ భగీరథ సెక్రటరీ హోదాలో ఐఏఎస్ స్మిత సబర్వాల్ హాజరయ్యారు. మీటింగ్ తర్వాత మంత్రితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మిషన్ భగీరథ కార్యకలాపాల గురించి మంత్రి సీతక్కకు వివరించారు. కొన్ని ఫైళ్ళపై సీతక్కతో సంతకాలు తీసుకున్నారు. మంత్రిగా సీతక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావడం, తాజాగా సీతక్కతో ప్రత్యేకంగా భేటీ కావడంతో స్మిత సబర్వాల్ పోస్టింగ్ కన్ఫర్మ్ అయిందా అని చర్చ జరుగుతోంది. అయితే, ఈ ప్రచారానికి చెక్ పెట్టేలా స్మిత సబర్వాల్ ఓ ట్వీట్ చేశారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు అధికారిగా మంత్రి సీతక్క బృందంలో భాగం కావడం సంతోషంగా ఉందని అందులో పేర్కొన్నారు. శాఖా పరమైన కార్యక్రమం కావడంతో మంత్రిని కలిశానని ట్వీట్ లో స్పష్టం చేశారు.



More Telugu News