Facebook: ఫేస్‌బుక్ నుంచి రూ.33 కోట్లు కొట్టేసిన మాజీ ఉద్యోగి.. ఏం చేసిందో తెలుసా

  • విలాసవంతమైన జీవితం కోసం కంపెనీ నిధులను దుర్వినియోగం చేసిన మహిళా ఉద్యోగి
  • మోసపూరిత విక్రయదారులు, నకిలీ ఛార్జీలు, నగదు ఆఫర్లు పేరిట వ్యక్తిగత అవసరాలకు డబ్బు వినియోగం
  • ఫేస్‌బుక్ వ్యయాల ఖాతాను ఉపయోగించిందని నిర్ధారణ.. నేరాన్ని ఒప్పుకున్న మాజీ ఉద్యోగి
Facebook ex employee admits Stealing over 4 Million dollars From Company

అమెరికాలోని కాలిఫోర్నియా, జార్జియాల్లో విలాసవంతమైన జీవితం కోసం సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ నుంచి ఆ కంపెనీ మాజీ ఉద్యోగి ఏకంగా 4 మిలియన్ డాలర్లకు పైగా (రూ.33 కోట్లు పైమాటే) కొట్టేసినట్టు నిర్ధారణ అయ్యింది. 2017 జనవరి నుంచి సెప్టెంబరు 2021 వరకు పేస్‌బుక్‌ ప్రధాన వ్యూహకర్తగా, ఎంప్లాయి రిసోర్సెస్ గ్రూపులకు గ్లోబల్ హెడ్‌గా వ్యవహరించిన బార్బరా ఫర్లో-స్మైల్స్ అనే మహిళ  ఈ నిర్వాకానికి పాల్పడినట్టు యూఎస్ అటార్నీ కార్యాలయం వెల్లడించింది. ఈ మేరకు నిందితురాలు తన నేరాన్ని అంగీకరించింది. మోసపూరిత విక్రయదారులు, నకిలీ ఛార్జీలు, నగదు ఆఫర్లు పేరు చెప్పి డబ్బు దొంగిలించిందని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు తెలిపారు. వ్యయాలకు సంబంధించి నకిలీ రిపోర్టులను సమర్పించేదని, కంపెనీలో అంతర్గత పరిణామాలను విస్మరించి ఈ మోసానికి పాల్పడిందని వివరించారు.

ఫేస్‌బుక్ గ్లోబల్ డైవర్సిటీ ఎగ్జిక్యూటివ్‌గా బార్బరా తన పదవిని దుర్వినియోగం పరిచిందని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు తెలిపారు. కాలిఫోర్నియా, జార్జియాలో విలాసవంతమైన జీవితం గడిపేందుకు ఫేస్‌బుక్ వ్యయాల ఖాతాను ఆమె ఉపయోగించిందని నిర్ధారణ అయ్యిందని వెల్లడించారు. హెయిర్ స్టైలిస్టులు, బేబీ సిట్టర్‌లు, ప్రీస్కూల్‌ ట్యూషన్ కోసం 18,000 డాలర్లు సహా వ్యక్తిగత అవసరాల కోసం పెద్ద మొత్తంలో కంపెనీ నిధులను ఉపయోగించుకుందని వివరించారు. బార్బరా కంపెనీ క్రెడిట్ కార్డ్‌లను పేపాల్, వెన్మో వంటి డిజిటల్ పేమెంట్ యాప్‌లకు లింక్ చేసిందన్నారు. తద్వారా ఆమె ఎప్పుడూ పొందని సేవల చెల్లింపులకు కార్డులను ఉపయోగించిందని జార్జియా యూఎస్ అటార్నీ నార్తర్న్ డిస్ట్రిక్ట్ ర్యాన్ కే  బుకానన్ చెప్పారు. బార్బరా తన స్నేహితులు, బంధువులు, కొందరు సహచరులను కూడా ఈ మోసపూరిత పథకంలో భాగం చేసుకుందని వివరించారు. ఆమె నుంచి స్వీకరించిన చెల్లింపుల్లో కొంత డబ్బుని ఆమెకు లేదా ఆమె భర్తకు ఇచ్చేవారని పేర్కొన్నారు.

More Telugu News