Sunil Lahri: రామమందిర ప్రారంభోత్సవానికి తనకు ఆహ్వానం అందలేదన్న ప్రముఖ నటుడు

Sunil lahri disappointed over not getting invitation for rammandir inaguration
  • రామాయణ్ సీరియల్‌లో లక్ష్మణుడి పాత్రలో గుర్తింపు పొందిన సునీల్ లాహ్రీ
  • రామమందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం లేకపోవడం ఆశ్చర్యపరచలేదని వ్యాఖ్య
  • ప్రారంభోత్సవంలో పాల్గొనే అవకాశం వచ్చి ఉంటే సంతోషించే వాణ్ణని వ్యాఖ్య
రామాయణ్.. ఒకప్పుడు యావత్ దేశాన్ని భక్తి పారవశ్యంలో ముంచెత్తిన టీవీ సీరియల్ ఇది. రామానంద్ సాగర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సీరియల్‌లో రాముడిగా అరుణ్ గోవిల్, సీతగా దీపిక చిక్లియా, లక్ష్మణుడిగా సునీల్ లాహ్రీ నటించారు. అయితే, అయోధ్యలో వచ్చే ఏడాది నిర్వహించనున్న శ్రీరామ మందిర ప్రారంభోత్సవానికి తనకు ఆహ్వానం అందలేదని సునీల్ లాహ్రీ తాజాగా పేర్కొన్నారు. అరుణ్ గోవిల్, దీపికకు ఆహ్వానపత్రికలు అందినా తనకు మాత్రం పిలుపు రాకపోవడం కాస్తంత నిరాశ కలిగించిందన్నారు. అయితే, ఆహ్వానం అందకపోవడంపై తానేమీ ఆశ్చర్యపోలేదని తెలిపారు.

ఆహ్వానం అందకపోవడానికి గల కారణాలను కూడా ఆయన ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. రామాయణ్‌లో తన క్యారెక్టర్‌కు అంత ప్రాధాన్యం లేదని ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వాహకులు భావించి ఉండొచ్చని వ్యాఖ్యానించారు. తనతో వారికి వ్యక్తిగతంగా ఏదైనా ఇష్యూ ఉండొచ్చని కూడా చెప్పుకొచ్చారు. ఇలాంటి కార్యక్రమాలకు ప్రతిఒక్కరికీ ఆహ్వానం అందాలన్న నియమం ఏదీ లేదని కూడా వ్యాఖ్యానించారు. అయితే, చారిత్రాత్మక క్షణాల్లో తనకూ భాగమయ్యే అవకాశం లభించి ఉంటే సంతోషించే వాడినని సునీల్ లాహ్రీ తెలిపారు.
Sunil Lahri
Ayodhya Ram Mandir
Bollywood

More Telugu News