Prabhas: నా 21 ఏళ్ల సినీ జీవితంలో ఇతడే బెస్ట్ డైరెక్టర్: ప్రభాస్

  • ప్రభాస్ హీరోగా సలార్
  • కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చిత్రం
  • డిసెంబరు 22న వరల్డ్ వైడ్ రిలీజ్
  • ప్రమోషన్స్ షురూ చేసిన చిత్రబృందం
  • ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలు వెల్లడించిన ప్రభాస్
Prabhas talks about his director Prashanth Neel

ప్రభాస్ హీరోగా 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'సలార్'. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం తొలి భాగం 'సలార్: సీజ్ ఫైర్' డిసెంబరు 22న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్ర పోషించారు. ఇటీవల వచ్చిన ట్రైలర్ తో 'సలార్' లో యాక్షన్ ఎలా ఉంటుందన్న దానిపై ప్రభాస్ అభిమానులు ఓ అంచనాకు వచ్చారు. 

కాగా, సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో చిత్రబృందం ప్రమోషన్స్ షురూ చేసింది. హీరో ప్రభాస్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. 

"నా 21 ఏళ్ల సినిమా కెరీర్ లో అత్యుత్తమ దర్శకుడు ఎవరంటే ప్రశాంత్ నీల్ అనే చెబుతాను. అతను నన్ను షూటింగ్ కు రమ్మని పిలిచినప్పుడు చాలా ఆసక్తిగా అనిపించేది. షూటింగ్ కోసం సెట్స్ మీదకు వెళ్లాననడం కంటే ప్రశాంత్ నీల్ తో హాయిగా కబుర్లు చెప్పుకునేందుకు వెళ్లాననడం సబబుగా ఉంటుందేమో. సలార్ షూటింగ్ ప్రారంభమైన మొదట్లో నాకు వచ్చిన మొదటి ఆలోచన ఇదే. 21 ఏళ్ల సినీ జీవితంలో ఎప్పుడూ ఇలా అనిపించలేదు. 

గత ఆర్నెల్లుగా నా వేదన కూడా ఇదే. పెర్ఫామ్ చేయడానికి వెళుతున్నానా, ఆస్వాదించడానికి వెళుతున్నానా అనేంతగా చక్కని వాతావరణం సెట్స్ పై కల్పించారు. అందుకు కారణం ప్రశాంత్ నీల్. నేను, ప్రశాంత్ నీల్ కేవలం ఒక్క నెలలోనే క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం. 

నటులను అర్థం చేసుకోవడంలో ప్రశాంత్ నీల్ తర్వాతే ఎవరైనా. నేను కానీ, శ్రుతి హాసన్ కానీ, పృథ్వీరాజ్ సుకుమారన్ కానీ సెట్స్ పైకి వచ్చామంటే చాలు... మేం దేనికోసం ఆగాల్సిన పని లేకుండా అన్నీ అందుబాటులో ఉండేలా చూసేవాడు. దాంతో షూటింగ్ ఎక్కడా అవాంతరాలు లేకుండా సాఫీగా సాగిపోయేది. 

నా వరకు నేను సెట్స్ మీదకు వెళ్లాక దేని కోసమూ వేచి చూడాల్సిన అవసరం రాలేదు. మా షాట్స్ పై మేం ఫోకస్ పెడితే చాలు.... మిగతా విషయాలన్నీ ప్రశాంత్ నీల్ చూసుకునేవాడు. పర్లేదు మేం వెయిట్ చేస్తాం... మిగతా షాట్లు తీయండి అన్నా వినిపించుకునేవాడు కాదు. సెట్స్ మీదకు వచ్చిన వారిని అతను నిరాశపరచడం నాకు తెలియదు. 

సరిగ్గా ఎప్పుడో గుర్తు లేదు కానీ, ఫస్ట్ షెడ్యూల్ సమయంలో అనుకుంటా... హీరో ఎంట్రీ సీన్లు మాత్రమే తీస్తున్నామంటూ మిగతా అంతా ఆపేశారు. అప్పుడు నేను చెప్పాను... ఫర్వాలేదు ప్రశాంత్... మిగతా షాట్లు ఏవైనా ఉంటే అవి కూడా తీసుకోండి... నా చిత్రాల్లో సగ భాగం నేను ఇలాగే వెయిట్ చేశాను అని కూడా చెప్పాను" అంటూ ప్రభాస్ వివరించారు. 

"ఈ సినిమా కోసం నేను ప్రత్యేకంగా చేసిందేమీ లేదు... అయితే ప్రశాంత్ ఈ క్యారెక్టర్ కోసం కండలు పెంచాలని చెప్పడంతో ఆ దిశగా కొంచెం శ్రద్ధ తీసుకున్నాను. కండలు పెంచడం అనేది నాకేమీ కొత్త కాదు కాబట్టి, నాలో నాకు పెద్దగా మార్పేమీ కనిపించలేదు. ఏ సినిమాకు తగ్గట్టుగా ఆ సినిమాకు మారడం నాకు అలవాటే. గత రెండు దశాబ్దాలుగా నా సినిమాల కోసం ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నాను" అని పేర్కొన్నారు.

More Telugu News