Atchannaidu: రూ.3 వేల పెన్షన్‌పై నాలుగున్నరేళ్లుగా జగన్ మడత పేచీ: అచ్చెన్నాయుడు

Atchannaidu take a jibe at CM Jagan over penion hike
  • పెన్షన్ ను రూ.3 వేలకు పెంచుతూ ఏపీ కేబినెట్ ఆమోదం
  • పింఛనులో ఇది జగన్ మార్కు వంచన అంటూ అచ్చెన్న ధ్వజం
  • 2022 నాటికే పెన్షన్ రూ.3 వేలకు పెంచాల్సి ఉందని స్పష్టీకరణ
  • వృద్ధులు, వితంతువులు, వికలాంగుల్ని దగా చేశారంటూ ఆగ్రహం
పెన్షన్ల పెంపు పేరుతో వృద్ధులు, వితంతువులు, వికలాంగుల్ని దగా చేయడం తప్ప జగన్ రెడ్డి సాధించిందేమీ లేదని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు ఊరూరా తిరిగి పెన్షన్లు రూ.3 వేలు చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఏటా రూ.250 చొప్పున పెంపు అంటూ హామీపై మడమ తిప్పారని ఆరోపించారు. ఆ మాట ప్రకారం పెంచినా 2022 నాటికే రూ.3 వేల పెన్షన్ ఇవ్వాలని అన్నారు. 

ఇప్పుడు ఎన్నికలకు మరో మూడు నెలల కాలం ఉందనగా రూ.3 వేలు చేస్తున్నామంటూ, కేబినెట్లో ఆమోదిస్తున్నామంటూ హడావుడి చేయడం సిగ్గుచేటు అని అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. ఇది ఇంకొక మోసం తప్ప మరొకటి కాదని మండిపడ్డారు. రూ.3 వేల హామీపై మడమ తిప్పి ఒక్కో పెన్షన్ దారుడికి జగన్ రెడ్డి దాదాపు రూ.32 వేల వరకు ఎగనామం పెట్టాడని వివరించారు. ఇదేనా పేదలపై చిత్తశుద్ధి? ఇదేనా పెన్షన్ దారులపై శ్రద్ధ? అంటూ నిలదీశారు. 

"నాడు తెలుగుదేశం ప్రభుత్వ సగటు బడ్జెట్ రూ.1.41 లక్షల కోట్లు మాత్రమే అయినప్పటికీ రూ.200 ఉన్న పెన్షన్ రూ.2000 చేశాం. ఐదేళ్లలో రూ.1,800 మేర పెంచాం. 20 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేశాం. వృత్తి కార్మికులకు కొత్తగా పెన్షన్లు మంజూరు చేశాం. ట్రాన్స్ జెండర్లకు పెన్షన్లు ఇచ్చాం. 

జగన్ రెడ్డికి సగటు బడ్జెట్ రూ.2.29 లక్షల కోట్లకు పైగా ఉన్నప్పటికీ ఐదేళ్లలో పెంచిన పెన్షన్ మొత్తం కేవలం రూ.750 మాత్రమే. కొత్తగా మంజూరు చేసిన పెన్షన్లూ అంతంత మాత్రమే. మరోవైపు ట్రాన్స్ జెండర్స్, బ్రాహ్మణ పెన్షన్లు రద్దు చేశారు. ఒక ఇంట్లో ఒకరికి మాత్రమే పెన్షన్ అంటూ వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు నోటీసులు పంపిన నీచపు చరిత్ర జగన్ రెడ్డికే సొంతం. 

చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఉంటే.. మొదటి ఏడాది నుంచే రూ.3 వేల చొప్పున పెన్షన్ అందేది. ఎల్లకాలం ప్రజల్ని మాటలతో మాయం చేయడం సాధ్యం కాదని జగన్ రెడ్డి గుర్తుంచుకోవాలి" అంటూ అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
Atchannaidu
Pension
Hike
Jagan
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News