Gas Cylinder: లబ్ధిదారుల ఎంపిక ఎలా?.. రూ. 500కే గ్యాస్ సిలిండర్‌పై రేవంత్ ప్రభుత్వం కసరత్తు

  • కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల్లో రూ. 500కు గ్యాస్ సిలిండర్ ఒకటి
  • రెండు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
  • మొదటి ప్రతిపాదనలో రేషన్‌కార్డు ఉన్న వారితోపాటు లేనివారిలోనూ లబ్ధిదారుల ఎంపిక
  • రెండో ప్రతిపాదనలో రేషన్‌కార్డుతో పనిలేకుండానే సిలిండర్ పంపిణీ
  • లబ్ధిదారులను బట్టి ప్రభుత్వంపై భారం
Telangana Govt Ready To Give Gas Cylinder For Rs 500 Only

ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఒకటైన రూ. 500కే గ్యాస్ సిలిండర్ పథకం హామీని నిలబెట్టుకునేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రెడీ అవుతోంది. మహాలక్ష్మి పథకం కింద గ్యాస్ సిలిండర్‌ను అందించనుండగా, ఇందుకోసం రెండు రకాల ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. రేషన్‌కార్డు ఉన్న వారితోపాటు లేని వారిలోనూ లబ్ధిదారులను ఎంపిక చేయడం అందులో మొదటిది కాగా, రేషన్‌కార్డుతో పనిలేకుండా లబ్ధిదారులకు అందించడం రెండోది. 

రాష్ట్రంలో మొత్తం 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉండగా వీరిలో 44 శాతం మంది (52.80 లక్షల మంది) ప్రతి నెల రీఫిల్ బుక్ చేసుకుంటున్నారు. రేషన్‌కార్డు ఉన్న కుటుంబాలు 89.99 లక్షలు. ఈ లెక్కన తొలి ప్రతిపాదన ప్రకారం ఈ పథకాన్ని త్వరగానే అమలు చేయవచ్చు, కాకపోతే అనర్హులు కూడా లబ్ధిదారులయ్యే అవకాశం ఉంది. అంటే దాదాపు కోటిమందికి రూ. 500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వాల్సి ఉంటుంది. అదే, రెండో ప్రతిపాదనను కనుక పరిగణనలోకి తీసుకుంటే లబ్ధిదారుల గుర్తింపు కోసం ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ‘గివ్ ఇట్ అప్’లో భాగంగా రాష్ట్రంలోని 4.2 లక్షల మంది రాయితీని వదులుకున్నారు. దీంతో మిగిలిన వినియోగదారుల్లో ఎంతమందిని ఈ పథకానికి ఎంపిక చేస్తారనేది ఆసక్తిగా మారింది. పథకానికి ఎంపికయ్యే లబ్ధిదారులకు ఏడాదికి 6 సిలింండర్లు ఇస్తే ప్రభుత్వంపై దాదాపు రూ. 2,225 కోట్ల అదనపు భారం పడుతుంది. అదే రూ. 12 సిలిండర్లు ఇస్తే కనుక ఇది రెండింతలు అవుతుంది.

More Telugu News