South Africa vs India: 3వ టీ20 మనదే... 5 వికెట్లతో మెరిసిన కుల్దీప్ యాదవ్

  • 202 పరుగుల లక్ష్య ఛేదనలో 95 పరుగులకే కుప్పకూలిన దక్షిణాఫ్రికా
  • 5 వికెట్లతో విజృంభించిన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్
  • ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచిన సూర్య కుమార్ యాదవ్
big win for india in 3rd T20I  level series with South Africa

సిరీస్‌ను సమం చేయాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా సత్తా చాటింది. సూర్య కుమార్ యాదవ్ సెంచరీ, కుల్దీప్ యాదవ్ 5 వికెట్ల ప్రదర్శనతో జోహనెస్‌బర్గ్ వేదికగా జరిగిన 3వ టీ20 మ్యాచ్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికాను భారత్ చిత్తు చేసింది. ఏకంగా 106 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. 202 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా ఆటగాళ్లు 13.5 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌట్ అయ్యారు. భారత బౌలర్ల ధాటికి దక్షిణాఫ్రికా బ్యాటర్లు చేతులెత్తేశారు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయారు. 

  టీమిండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 5 వికెట్లతో సత్తాచాటాడు. రవీంద్ర జడేజా 2 వికెట్లు, ముకేశ్ కుమార్, అర్షదీప్ సింగ్ చెరో వికెట్ తీయగా.. మరో వికెట్ రనౌట్ రూపంలో వచ్చింది. 35 పరుగులు రాబట్టిన డేవిడ్ మిల్లర్ దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. మార్ర్కమ్ 25, డొనోవాన్ 12 మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. మిగతావారంతా సింగిల్ డిజిట్ రన్స్ మాత్రమే చేయగలిగారు. దీంతో మూడు టీ20ల సిరీస్ 1-1తో సమం అయ్యింది. మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. 

ఇక టీమిండియా బ్యాట్స్‌మెన్ ఈ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా ఓపెనర్ యశస్వి జైస్వాల్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అదిరిపోయే బ్యాటింగ్ చేశారు. ఓపెనర్ శుభ్‌మాన్ గిల్, ఆ తర్వాత తిలక్ వర్మ వెంటవెంటనే ఔట్ అయినప్పటికీ జైస్వాల్-సూర్య జోడి ఏకంగా 100కిపైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. 40 బంతుల్లోనే 60 పరుగులు చేసి జైస్వాల్ వెనుదిరగగా సూర్య సెంచరీతో చెలరేగాడు. ఏకంగా 8 సిక్సర్లు, 7 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసి వికెట్ కోల్పోయాడు. ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో సూర్య ఏకంగా మూడు సిక్సర్లు బాదాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా 7 వికెట్లు నష్టపోయి 201 పరుగుల భారీ స్కోరు చేసింది. రింకూ సింగ్ (14), శుభ్‌మాన్ గిల్ గిల్ (8),  తిలక్ వర్మ(0), సూర్యకుమార్ యాదవ్ (100), జితేశ్ శర్మ (4), రవీంద్ర జడేజా (4), అర్షదీప్ సింగ్ (0 నాటౌట్), మహ్మద్ సిరాజ్ (2 నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. ఈ సిరీస్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు.

More Telugu News