Raja Singh: శబరిమలలో భక్తుల ఇబ్బంది... రేవంత్ రెడ్డికి రాజాసింగ్ విజ్ఞప్తి

  • తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు శబరిమలకు వెళ్తారన్న రాజాసింగ్
  • తెలుగు భక్తులకు తాగునీరు, పార్కింగ్ సదుపాయం లేక ఇబ్బందిపడుతున్నారని ఆవేదన
  • స్వాములకు అన్న ప్రసాదం చేద్దామన్నా... కేరళ ప్రభుత్వం అనుమతించడం లేదని ఆగ్రహం
  • కేరళలోనూ తెలంగాణ భవన్ ఏర్పాటు చేయాలని సూచన
Raja Singh appeal to CM Revanth Reddy

శబరిమలకు భక్తుల తాకిడి పెరిగిన ఈ సమయంలో కేరళ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లపై విపక్షాలు మండిపడుతున్నాయి. మౌలిక వసతులు లేకపోవడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు లెఫ్ట్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నాయి. తెలంగాణ బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ శబరిమలలో ప్రభుత్వ ఏర్పాట్లపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వెళ్లే అయ్యప్పలకు తాగునీరు, పార్కింగ్ సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాములకు అన్న ప్రసాదం చేద్దామని భావించినప్పటికీ కేరళ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించారు.

ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు శబరిమలకి వెళతారన్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయని, ఆయనతో మాట్లాడి భోజన వసతి, తాగునీటి సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ తరహాలో కేరళలో కూడా తెలంగాణ భవన్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందు కోసం ఐదు నుంచి పదిహేను ఎకరాల స్థలం తీసుకోవాలన్నారు. తెలంగాణ భవన్ నిర్మిస్తే అక్కడ స్వాములు బస చేసేందుకు వెసులుబాటు ఉంటుందన్నారు.

More Telugu News