YSRCP: టీడీపీ దొంగ ఓట్లను చేర్చుతోంది... ఢిల్లీలో సీఈసీకి ఫిర్యాదు చేసిన వైసీపీ ఎంపీలు

  • ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన వైసీపీ ఎంపీలు
  • ఏపీలో 40,76,580 దొంగ ఓట్లను చేర్పించారంటూ టీడీపీ నేతలపై ఫిర్యాదు
  • టీడీపీ నేతలు బీఎల్వోలను కూడా బెదిరిస్తున్నారని ఆరోపణ  
  • పొరుగు రాష్ట్రాల్లో ఉన్నవారి ఓట్లను ఏపీలో నమోదు చేస్తున్నారని కంప్లైంట్ 
YCP MPs met CEC and complaints against TDP

విజయసాయిరెడ్డి నేతృత్వంలో వైసీపీ ఎంపీలు నేడు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. ఏపీలో టీడీపీ దొంగ ఓట్లను చేర్చుతోందంటూ సీఈసీకి ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు 40,76,580 దొంగ ఓట్లను చేర్పించారంటూ తమ ఫిర్యాదులో ఆరోపించారు. ఒకే ఫొటోతో ఇంటి పేరు మార్చి అవకతవకలకు పాల్పడ్డారని వివరించారు. 

ఏపీలో దొంగ ఓట్లన్నీ టీడీపీ సానుభూతిపరులవేనని సీఈసీకి తెలిపారు. హైదరాబాద్, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో  ఉన్న టీడీపీ సానుభూతిపరుల ఓట్లను ఏపీలో నమోదు చేయించారని వైసీపీ ఎంపీలు ఆరోపణలు చేశారు. 

విచారణ చేసి దొంగ ఓట్లను తొలగిస్తున్న బీఎల్వోలపై టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారని, విచారణలో నిజాలు వెలుగుచూస్తుండడంతో బీఎల్వోలను టీడీపీ నేతలు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. వైసీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు ఫారం-7 దరఖాస్తులు ఇస్తున్నారని వెల్లడించారు. దీనిపై ఎన్నికల సంఘం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని విజయసాయిరెడ్డి, తదితర వైసీపీ ఎంపీలు కోరారు. 

అటు, టీడీపీ నేతలు కూడా దొంగ ఓట్ల అంశంలో వైసీపీపై ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సీఈసీని టీడీపీ నేతలు కలవగా పార్టీ అధినేత చంద్రబాబు ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాశారు. ఇప్పుడు వైసీపీ కూడా దొంగ ఓట్లు అంటూ టీడీపీపై ఎదురుదాడికి దిగింది.

More Telugu News