Sajjala Ramakrishna Reddy: ఇన్ఛార్జీల మార్పులతో కొందరికి బాధ, ఆవేదన వుంటాయి: సజ్జల రామకృష్ణారెడ్డి

  • ప్రజలకు ఏదైతే చెప్పామో అదే చేస్తున్నామన్న సజ్జల
  • తెలంగాణలో జనసేనకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయని ఎద్దేవా
  • రాజకీయ పార్టీగా టీడీపీ ఉనికిని కోల్పోయిందని వ్యాఖ్య
Sajjala on YSRCP incharges changes

పలు నియోజకవర్గాలకు వైసీపీ ఇన్ఛార్జీలను మార్చిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ... ఇన్ఛార్జీల మార్పులతో కొంతమందిలో బాధ, ఆవేదన ఉంటాయని చెప్పారు. రానున్న రోజుల్లో అన్నీ సర్దుకుంటాయని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ ఎంతో బాధ్యతగానే పని చేశామని చెప్పారు. ప్రజలకు ఏదైతే చెప్పామో అదే చేస్తున్నామని అన్నారు. సిట్టింగులను మార్చడం అనేది ఎన్నికల సమయంలో జరిగే సాధారణ ప్రక్రియేనని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధమేనని అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ కోసం ఎదురు చూడటం లేదని చెప్పారు. 


జగన్ కు, వైసీపీ ప్రభుత్వానికి ప్రజల్లో ఎంతో ఆదరణ ఉందని... ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో విపక్షాలు ఉన్నాయని సజ్జల అన్నారు. జైల్లో ఉన్నప్పుడు ప్రపంచంలోని అన్ని రోగాలు తనకు ఉన్నాయని చంద్రబాబు చెప్పుకున్నారని... ఇప్పుడు రొమ్ములు విరుచుకుని దేశమంతా తిరుగుతానని అంటున్నారని విమర్శించారు. టీడీపీ - జనసేన పొత్తులో ఉన్నాయని... ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పాలని అన్నారు. తెలంగాణలో జనసేనకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయని చెప్పారు. ఒక రాజకీయ పార్టీగా టీడీపీ ఉనికిని కోల్పోయిందని... ఇప్పుడు ముఠాగా తయారయిందని దుయ్యబట్టారు.

More Telugu News