Kothakota Srinivas Reddy: డ్రగ్స్ దందా చేసేవాళ్లు ప్యాకప్ చెప్పాల్సిందే.. లీవ్ అవర్ సిటీ: బాధ్యతలు చేపడుతూనే వార్నింగ్ ఇచ్చిన కొత్త సీపీ శ్రీనివాస్‌రెడ్డి

  • తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్న సీపీ శ్రీనివాస్‌రెడ్డి
  • సినీ పరిశ్రమలోనూ మార్పు రావాల్సిందేనన్న సీపీ
  • నూతన సీపీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్‌రెడ్డి
Hyderabad CP Srinivas Reddy Warns Drug Peddlers

హైదరాబాద్‌లో డ్రగ్స్ దందా చేసేవాళ్లు వెంటనే ఖాళీ చేసి వెళ్లాలని, లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. పోలీస్ కమిషనర్‌గా నియమితులైన ఆయన ఈ ఉదయం బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో బాధ్యతలు స్వీకరించారు. గతంలో గ్రేహౌండ్స్, ఆక్టోపస్‌లో పనిచేసిన శ్రీనివాస్‌రెడ్డికి ముక్కుసూటిగా వ్యవహరించే అధికారిగా పేరుంది. బాధ్యతల స్వీకరణ అనంతరం ఆయన మాట్లాడుతూ.. తన శక్తిసామర్థ్యాలు గుర్తించి తనకు సీపీగా బాధ్యతలు అప్పగించినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. 

ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటానని పేర్కొన్నారు. మహిళలపై వేధింపులు, ర్యాగింగ్‌పై షీటీమ్స్ ద్వారా పనితీరును మరింత మెరుగుపరుస్తామని తెలిపారు. తెలంగాణను మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్టు పేర్కొన్నారు. డ్రగ్స్ ముఠాలు తెలంగాణను వీడకుంటే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. డ్రగ్స్ విషయంలో సినీ పరిశ్రమలో మార్పు రాకుంటే కూడా తీవ్రమైన చర్యలు ఉంటాయన్నారు. సినీ పెద్దలతో త్వరలోనే సమావేశమై ఈ విషయాలు చర్చిస్తామని సీపీ తెలిపారు.

More Telugu News