Joe Biden: రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్యఅతిథిగా జో బైడెన్ రానట్టే!

  • ‘స్టేట్ ఆఫ్ ది యూనియన్’ ప్రసంగం, ఎన్నికల ప్రచారం నేపథ్యంలో బైడెన్ రావడం లేదన్న విశ్వసనీయ వర్గాలు
  • గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా రావాలంటూ సెప్టెంబర్‌లో ఆహ్వానించిన ప్రధాని మోదీ
  • క్వాడ్ సదస్సు ఈ ఏడాది చివరిలోనే నిర్వహించాలనుకుంటున్న భారత్
Joe Biden will not be comming to india as chief guest for the Republic Day celebrations

జనవరి 26న జరగనున్న భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హాజరుకాకపోవచ్చని తెలుస్తోంది. జనవరి చివరిలో లేదా ఫిబ్రవరి ఆరంభంలో అధ్యక్షుడు బైడెన్ ‘స్టేట్ ఆఫ్ ది యూనియన్’ ప్రసంగం చేయాల్సి ఉండడం, మరోవైపు ఎన్నికల ప్రచారం, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై అమెరికా ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో భారత్‌కు ప్రయాణించకూడదని ఆయన నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ మేరకు భారత్‌కు సమాచారం అందిందని ఈ వ్యవహారంపై అవగాహన ఉన్న విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

జనవరి 26, 2024న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా రావాల్సిందిగా అధ్యక్షుడు బైడెన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించారని భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి సెప్టెంబర్ నెలలో వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే గణతంత్ర దినోత్సవ వేడుకలకు బైడెన్‌ను ముఖ్యఅతిథిగా ఆహ్వానించినట్టు భారత్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. 

ఇదిలావుంచితే.. జనవరిలో జరగాల్సిన క్వాడ్ సదస్సును డిసెంబర్ చివరిలోనే ఏర్పాటు చేయాలని ఆతిథ్య భారత్ నిర్ణయించింది. 2024లో నిర్వహణకు ప్రతిపాదించినప్పటికీ ప్రతిపాదిత తేదీల్లో అన్ని భాగస్వామ్య దేశాలు పాల్గొనే అవకాశం లేకపోవడంతో సవరించాలని భావిస్తున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కాగా క్వాడ్ అనేది అమెరికా, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలతో కూడిన కూటమి. ఉమ్మడి ప్రయోజనాల రక్షణకు ఇది ఏర్పాటైంది.

More Telugu News