Nara Lokesh: ​పెద్దపల్లి లక్ష్మి అనే మహిళకు నారా లోకేశ్ రూ.2 లక్షల సాయం

  • పాయకరావుపేట నియోజకవర్గంలో యువగళం
  • చిన్నదొడ్డిగల్లు గ్రామంలో మహాశక్తితో లోకేశ్ కార్యక్రమం
  • మహిళలతో సమావేశమైన నారా లోకేశ్
Nara Lokesh announced Rs 2 lakhs for Peddapalli Lakshmi

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నేడు పాయకరావుపేట నియోజకవర్గం చిన్నదొడ్డిగల్లు గ్రామంలో మహాశక్తితో లోకేశ్ కార్యక్రమం నిర్వహించారు. మహిళలతో ముఖాముఖి సమావేశమయ్యారు. 

ఈ సభలో నర్సీపట్నం నియోజకవర్గం తామర గ్రామానికి చెందిన పెద్దపల్లి లక్ష్మి అనే మహిళ తన విషాదాన్ని లోకేశ్ ముందుంచింది. తమ గ్రామంలో వైసీపీ నాయకులు ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్ గుద్ది తన కుమారుడు 25 ఏళ్ల సాయి చనిపోయాడు అని ఆవేదన వ్యక్తం చేసింది. 

అయితే, అది యాక్సిడెంట్ కాదు... కరెంట్ షాక్ తో చనిపోయాడు అని రిపోర్టులు మార్చారని పెద్దపల్లి లక్ష్మి ఆరోపించింది. కనీసం తమ కుటుంబానికి న్యాయం చెయ్యలేదని... రూ.25 వేలు ఇస్తాం... నోరు ఎత్తకండి అని వైసీపీ నేతలు బెదిరించారని వెల్లడించింది. ప్రస్తుతం కుమార్తెకు పెళ్లి చెయ్యడానికి ఇబ్బంది పడుతున్నాను అంటూ పెద్దపల్లి లక్ష్మి కన్నీటి పర్యంతమైంది. 

లక్ష్మి ఆవేదన విని చలించిపోయిన లోకేశ్


పెద్దపల్లి లక్ష్మి పరిస్థితి విన్న తర్వాత నారా లోకేశ్ చలించిపోయారు. లక్ష్మి కుటుంబానికి రూ.2 లక్షల ఆర్ధిక సాయం అందిస్తాం అని సభాముఖంగా ప్రకటించారు. ఆమె కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కష్టాల్లో ఉన్నవారి కోసం నిలిచే పార్టీ టీడీపీ అని స్పష్టం చేశారు.

దివ్యాంగురాలికి స్కూటీ

జగన్ ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చే అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఆపేసిందంటూ వెంకటలక్ష్మి అనే దివ్యాంగురాలు వాపోయింది. గత టీడీపీ ప్రభుత్వంలో స్కూటీలు ఇచ్చారని, ఇప్పుడు అవి కూడా జగన్ ప్రభుత్వం ఇవ్వడం లేదని వివరించారు.. కార్పొరేషన్ నుండి కూడా ఎటువంటి సాయం అందడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. దివ్యాంగురాలు వెంకటలక్ష్మి ఆవేదన విన్న లోకేశ్ స్పందించారు.  వెంకటలక్ష్మికి స్కూటీ అందిస్తానని హామీ ఇచ్చారు.

More Telugu News