Uttam Kumar Reddy: పౌరసరఫరాలశాఖ రూ. 56 వేల కోట్ల నష్టంలో ఉంది.. త్వరలోనే గ్యాస్ సిలిండర్ హామీ నిలబెట్టుకుంటాం: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

  • గత పాలకుల తప్పిదాలతో పౌరసరఫరాలశాఖ నష్టంలో కూరుకుపోయిందన్న మంత్రి
  • పేదలకు నాణ్యమైన బియ్యం అందిస్తామన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
  • మరో వంద రోజుల్లో రూ. 500కే గ్యాస్ సిలిండర్
  • రాష్ట్రంలోని అన్ని శాఖల పరిస్థితీ ఆందోళనకరంగానే ఉందన్న మంత్రి
Uttam Kumar Reddy Says Civil Supplies Ministry Is In Rs 56000 Debt

తెలంగాణ పౌరసరఫరాలశాఖ రూ. 56 వేల కోట్ల నష్టంలో ఉందని ఆ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ నష్టానికి గత పాలకుల తప్పిదాలే కారణమని విమర్శించారు. తన శాఖపై హైదరాబాద్‌లో నిర్వహించిన సమీక్ష అనంతరం మంత్రి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పేదలకు నాణ్యమైన బియ్యం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. పౌరసరఫరాలశాఖ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పేర్కొన్నారు.

12 శాతం మంది వినియోగదారులు రేషన్‌కార్డులు ఉపయోగించలేదని, రేషన్ బియ్యాన్ని కొందరు పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు. కొత్త రేషన్‌కార్డు దరఖాస్తులపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. రేషన్ దుకాణాల ద్వారా అందిస్తున్న మనిషికి ఆరు కేజీల బియ్యంలో 5 కేజీలు కేంద్రమే ఇస్తోందని, రాష్ట్రం ఇచ్చే కిలో బియ్యం నాణ్యత మరింత పెరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. లబ్ధిదారులకు తినగలిగే బియ్యం ఇవ్వాలన్నారు. 

తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో బోల్డన్ని లోపాలు ఉన్నాయని, ఉన్న రేషన్‌కార్డుదారుల్లో 89 శాతానికి మించి ఎవరూ బియ్యం తీసుకోలేదని పేర్కొన్నారు. కొత్త రేషన్‌కార్డుల డిమాండ్ ఉందని, వెంటనే ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. రాష్ట్రంలో అన్ని శాఖల్లోనూ ఆర్థిక పరిస్థితి ఏమంత బాగోలేదని మంత్రి తెలిపారు. ఆరు గ్యారెంటీల్లో ఒకటైన రూ. 500కే గ్యాస్ సిలిండర్ హామీని 100 రోజుల్లో అమలు చేస్తామని తెలిపారు.

More Telugu News