Revanth Reddy: రేవంత్‌రెడ్డి సర్కారు మరో గుడ్‌న్యూస్.. రేషన్‌కార్డు కోసం ఏళ్ల తరబడి ఎదురుచూపులకు చెక్!

  • ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రేషన్‌కార్డు తప్పనిసరి
  • నేడు పౌరసఫరాల అధికారులతో మంత్రి ఉత్తమ్ సమీక్ష
  • అనంతరం కొత్త కార్డుల జారీపై నిర్ణయం!
Revanth Reddy Govt Ready To Issue Ration Cards

కొత్త రేషన్‌కార్డుల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న తెలంగాణలోని పేదలకు రేవంత్‌రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ సర్కారు తీపికబురు చెప్పింది. అధికారంలోకి వచ్చిన వెంటనే హామీల అమలుకు నడుంబిగించిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తాజాగా అర్హులందరికీ రేషన్‌కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేడు ఆ శాఖ అధికారులతో సమావేశమవుతారు. అనంతరం కొత్త రేషన్‌కార్డుల జారీపై నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ప్రభుత్వం ప్రారంభించిన రాజీవ్ ఆరోగ్యశ్రీ సహా సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందేందుకు రేషన్‌కార్డు తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే కొత్తకార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

2014 నుంచి తెలంగాణలో కొత్త రేషన్‌కార్డులు జారీ చేయకపోవడంతో లక్షలాదిమంది పేదలు వాటికోసం ఎదురుచూస్తున్నారు. దీనికి తోడు ప్రభుత్వం వద్ద కూడా వేలాది దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి. దీనికితోడు పేరు మార్పులు, కుటుంబ సభ్యుల పేర్లు చేర్పించడం, ఉమ్మడి కుటుంబాల నుంచి వేరుపడిన వారు.. ఇలా ఎన్నో దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి. ఒక్క హైదరాబాద్‌లోనే రేషన్‌కార్డుల కోసం దాదాపు 1.25 లక్షల దరఖాస్తులు అందాయి. ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని రకాల కార్డులు కలిపి 90.14 లక్షల కార్డులున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన రాజీవ్ ఆరోగ్యశ్రీతోపాటు సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి పథకం, విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యా భరోసా వంటి పథకాలకు రేషన్‌కార్డు తప్పనిసరి. ఈ నేపథ్యంలో నేటి సమావేశం తర్వాత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పెండింగ్ దరఖాస్తులకు మోక్షం కల్పించడంతోపాటు కొత్త వాటికి జారీకి కూడా ఆదేశాలు జారీచేస్తారని తెలుస్తోంది.

More Telugu News