Vasantha Krishna Prasad: నేను రాజీనామా చేశాననే ప్రచారంలో నిజం లేదు: వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్

  • కొందరు ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారని మండిపడిన మైలవరం ఎమ్మెల్యే
  • దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని వైసీపీ శ్రేణులకు పిలుపు నిచ్చిన కృష్ణ ప్రసాద్
  • ఎమ్మెల్యే పదవికి, వైసీపీకి రాజీనామా చేశారంటూ సోమవారం జోరుగా సాగిన ప్రచారం
There is no truth in the campaign that I have resigned says YCP MLA Vasantha Krishna Prasad

ఎమ్మెల్యే పదవికి, వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేశారంటూ తనపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారంపై మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ స్పందించారు. రాజీనామా ప్రచారాన్ని ఆయన ఖండించారు. కొందరు ఉద్దేశపూర్వకంగానే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రచారంలో అస్సలు నిజం లేదని, ప్రచారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. తనకు వ్యతిరేకంగా సాగుతున్న ప్రచారాన్ని వైసీపీ శ్రేణులు తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఎమ్మెల్యే పదవితోపాటు వైసీపీకి రాజీనామా చేశారంటూ సోషల్ మీడియా వేదికగా సోమవారం జోరుగా ప్రచారం జరిగింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా నేపథ్యంలో ఈ ప్రచారం జరగడం గమనార్హం.

ప్రతిదీ రాజకీయం చేయడమే ప్రతిపక్ష నేత పని..

ప్రతి అంశాన్ని రాజకీయం చేయడమే ప్రతిపక్ష నేత పని అని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మండిపడ్డారు. నిరాధార ఆరోపణలు చేస్తూ తనపై దుష్ప్రచారం చేయడమే ఎజెండాగా పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నంలో సోమవారం జరిగిన లంక భూముల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. అధికారం లేకపోయేసరికి ప్రతిపక్ష నేత మతిస్థిమితం కోల్పోయారని, ప్రతిచోట ఉన్మాదంతో ఊగిపోతున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

పుష్కరనగర్, ఇసుకరేవులో నివసిస్తున్న పేదలకు కృష్ణానది ముంపు ప్రాంతానికి దూరంగా గాజులపేటలో సురక్షిత ప్రాంతంలో ఇళ్లస్థలాలు ఇస్తే దానిని కూడా రాజకీయం కోసం వాడుకున్నారని అన్నారు. అన్ని వ్యవస్థలు, అన్ని రంగాల్లోనూ మంచి, చెడు ఉంటాయన్నారు. మంచిని స్వీకరిస్తూ చెడును సరిచేసుకుంటూ ముందుకెళ్లాలని అన్నారు. మైలవరం నియోజకవర్గంలో 20 వేల మందికి పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చామని, మిగిలిన కొన్ని గ్రామాల్లో కూడా ఇళ్ల స్థలాల పంపిణీకి చర్యలు తీసుకుంటామని వసంత కృష్ణప్రసాద్ హామీ ఇచ్చారు.

More Telugu News